NEET 2023 Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్(NEET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఈ ఏడాది జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. 99.99 పర్సంటైల్ స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయగా.. 11.45 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Read Also: Amit Sha Tour: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళి పలువురు ప్రముఖులతో భేటీ..!
రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే ఉత్తర్ ప్రదేశ్ నుంచి అత్యధికంగా ఎక్కువమంది అభ్యర్థులు అర్హత సాధించారు. 1.39 లక్షల మంది యూపీ నుంచి అర్హత సాధించగా.. ఆ తరువాతి స్థానాల్లో 1.31 లక్షల మందితో మహారాష్ట్ర, 1 లక్ష మందితో రాజస్థాన్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండు రాష్ట్రాలు కాగా, రాజస్థాన్ కూడా జనాభా పరంగా మొదటి పది స్థానాల్లో ఉంది.
ఎన్టీఏ మే 7న దేశంలోని 499 నగరాల్లో 4,097 కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను నిర్వహించింది. పరీక్ష మొత్తం 13 భాషల్లో (అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ) నిర్వహించబడింది. భారతదేశం వెలుపల అబుదాబి, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్‌తో పాటు దుబాయ్ మరియు కువైట్ సిటీలలో కూడా నిర్వహించారు. ఎన్టీఏ అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ కేటాయిస్తుంది. అడ్మిషన్ అధికారులు మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయిస్తారు.