రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. విపక్షాల అభ్యర్థిని ఎంపిక చేసేముందు తనను సంప్రదించలేదని ఆమె అన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె మమతా బెనర్జీ కొన్ని ఎంపిక చేసుకున్న పార్టీలనే పిలిచారని పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా అభ్యర్థి ఎంపికపై తమను సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. విపక్ష దళాల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపిన తొలి పార్టీగా బీఎస్పీ నిలిచింది.
బీజేపీకి మద్దతుగానో.. విపక్ష కూటమిని వ్యతిరేకించడమో తమ ఉద్దేశం కాదని ఆమె అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించామన్నారు. దళితుల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె అన్నారు. సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.
ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ముర్ము నామినేషన్ పత్రంలో ప్రధాని మోదీ, నడ్డాతో సహా పలువురు అగ్ర నేతలు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేశారు. మరోవైపు విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది.
