ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఎస్పీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత నెలలో పార్టీ నుంచి బహిష్కరించిన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మాయావతి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఆసక్తిగా మారింది.
ఆకాశ్ ఆనంద్‌ను సెప్టెంబర్ 10న బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మాయావతి బహిష్కరించారు. అయితే అక్టోబర్ 2న మాయావతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. మాయావతిని రాజకీయ గురువుగా అభివర్ణించాడు. బీఎస్పీ పట్ల విధేయతను కనుపరుచాడు. మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. హిందీలో రాసిన పోస్ట్‌లో మాయావతిని ‘బువా మా’ అని సంబోధించాడు. అనూహ్యంగా క్షమాపణ చెప్పిన కొన్ని గంటలకే ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి తీసుకుని.. జాతీయ సమన్వయకర్తగా నియమించారు.
‘‘రాజకీయాల్లో నేను నేర్చుకున్నదంతా మీ నుంచే నేర్చుకున్నాను. నేను చేసినదంతా మీ మార్గదర్శకత్వంలోనే చేశాను. అందువల్ల ఈరోజు నా మాటలను నేరుగా మీ ముందు, యావత్ బహుజన సమాజం ముందు ఉంచాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో నా గురించి రకరకాల వార్తలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను మరే ఇతర రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. బీఎస్పీ నాకు కేవలం ఒక పార్టీ కాదు. అది నా కుటుంబం.’’ అని ఆయన అన్నారు.

