త్రిపుర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది.. త్రిపుర సీఎం పదవికి బిప్లవ్దేవ్రాజీనామా చేయగా.. ఎంపీ మాణిక్సాహాను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.. బిప్లవ్ దేశ్ రాజీనామా తర్వాత సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేఎల్పీ నేతగా మాణిక్ సాహాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో, త్వరలోనే త్రిపుర సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు మాణిక్ సహా.. అయితే, ఎంపీగా, ప్రస్తుతం త్రిపుర బీజేపీ చీఫ్‌గా ఉన్న డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ అధిష్టానం త్రిపుర సీఎంగా ఖరారు చేసింది.
అయితే, ముఖ్యమంత్రి పదవికి మాణిక్ సాహా పేరును బిప్లబ్ దేబ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.. శనివారం సాయంత్రం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో త్రిపురలో ముఖ్యమంత్రిగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాణిక్ సాహా ఎంపికయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే హాజరయ్యారు.. అగర్తలాలో సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ పాల్ నిరసన ప్రారంభించడంతో గందరగోళం ఏర్పడింది.