Iron Rod: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి మృత్యువు కాటేస్తుంది. కానీ రైలులో కూర్చున్న ప్రయాణికుడికి మృత్యువు కిటికీలో నుంచి దూసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎవరి ఊహకు అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అప్పుడు సమయం ఉదయం 8:45 గంటలు. చలి కారణంగా కిటికీ గ్లాస్ కూడా కిందికి దించే ఉంది.
Read Also: Maharashtra: శ్రద్ధాను 35 ముక్కలుగా నరికాడు..నేను 70 ముక్కలుగా నరికేస్తా..
నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళ్తోంది. అయితే అంతలోనే ఎక్కడి నుంచి దూసుకువచ్చిందో తెలియదు కానీ ఓ ఇనుప కడ్డీ కిటికీ అద్దాలను పగులకొట్టుకుంటూ హరికేశ్ మెడలో గుచ్చుకుంది. అతడి కళ్లలోంచి కూడా రక్తపు ధారలు బయటకి వచ్చాయి. అవి పక్క సీటు వరకు పారుకుంటూ వెళ్లాయి. పక్కన ఉన్నవారు ఏం జరిగిందో తెలుసుకునేలోపే హరికేశ్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్ జంక్షన్‌లో రైలును నిలిపివేసి మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుప కడ్డీ బోగీలోకి దూసుకువచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. లక్నోలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని హరికేశ్ బంధువు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య షాలిని, కుమార్తె ఆర్య (7), కుమారుడు అయాన్ష్ (4) ఉన్నారు.
