Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశాడు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
‘‘బీజేపీ, జ్ఞానేశ్ కుమార్ కలిసి బెంగాల్ ఎన్నికల్ని దోచుకున్నారు. మీకు నైతిక బలం ఉంటే మా ఎన్నికల్ని తిరిగి ఇవ్వండి’’ అని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించిందని, ఈ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి రక్షణ కల్పించిందని, సీఈసీని అరెస్ట్ చేయాలని, ఆయనకు పదవిలో కొనసాగేందుకు నైతిక అధికారం లేదని మమత అన్నారు.
జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. ఇది బెంగాల్‌కే పరిమితమైన డిమాండ్ కాదని, ఎస్ఐఆర్ నిర్వహించిన అన్ని రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు. తమ ఫిర్యాదులపై ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించామని, సామాన్య ప్రజల గొంతును న్యాయవ్యవస్థ వినాలని ఆమె అన్నారు.
దీనికి ముందు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈసీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఎస్ఐఆర్ సహా తుది నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతో తీసుకున్నామని తెలిపింది.

