NTV Telugu Site icon

దీదీకి షాక్..!

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. న్యాయ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ 5 లక్షల ఫైన్‌ విధించిన న్యాయ స్థానం.. జడ్జిలపై మమత తప్పుడు ఆరోపణలు సరికాదని పేర్కోంది. నందిగ్రామ్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన కేసును విచారిస్తున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌషిక్‌ చందాకు.. బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల బెంగాల్‌ సీఎం మమత ఆరోపించారు. కౌషిక్ చందాను ఆ కేసు నుంచి తప్పించి.. పిటిషన్‌ను మరొక జడ్జికి బదలాయించాలని కోరారు. ఈ పిటిషన్‌ను స్వయంగా విచారించిన కౌశిక్‌ చందా.. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ మమతకు జరిమానా విధించారు. అదే సమయంలో ఆ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. జ‌డ్జికి క‌ళంకం తెచ్చే విధంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వ్యవహరించారని ఆయన ఆరోపించారు. న్యాయవ్యవస్థపై దురుద్దేశాలు ఆపాదించినందుకు మమతా బెనర్జీ 5 లక్షల జరిమానాను ఎదుర్కొంటున్నారని కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. జరిమానా చెల్లించిన మొత్తాన్ని కోవిడ్ బాధిత న్యాయవాదుల కుటుంబాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.