NTV Telugu Site icon

Online News: ఆన్‌లైన్ వార్తలకే జై కొడుతున్న ఇంటర్నెట్ యూజర్స్.. నివేదికలో వెల్లడి..

Online News

Online News

Online News: భారతదేశంలో రోజురోజుకు ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతున్నారు. దీంతో పాటే ఆన్‌లైన్ వార్తలకు ఎక్కువ మంది యూజర్స్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దాదాపుగా సగానికి కన్నా ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్ లో వార్తల్ని చూస్తున్నట్లు కాంటార్-గూగూల్ నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో 37 శాతం ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని 63 శాతం మంది వార్తల కోసం ఆన్‌లైన్ వినియోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది. వివిధ భారతీయ భాషల్లోని 52 శాతం అంటే 37.9 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు న్యూస్ యాప్‌లు/వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, మెసేజ్ ఫార్వార్డ్‌లు, యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్‌లో వార్తలను యాక్సెస్ చేస్తున్నారు.

సాంప్రదాయ టీవీ ఛానెళ్ల కన్నా ఆన్‌లైన్‌కు ఎక్కువ ఆదరణ ఉందని 48 శాతం మంది చెప్పారు. మొత్తం భారతదేశంలో 72.9 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. 14 రాష్ట్రాల్లో 8 భాషలకు చెందిన 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న యూజర్ల వార్తల వినియోగ అలవాట్లను అర్థం చేసుకోవడానికి 16 నగరాల్లో 4600 మంది అభిప్రాయాలతో పాటు 64 గుణాత్మక చర్చలు నిర్వహించినట్లు కాంటార్ వెల్లడించింది.

Read Also: Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు

ఆన్‌లైన్ వార్తల వినియోగంలో వీడియోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ఆ తరువాత టెక్ట్స్, ఆడియో వార్తలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీడియోల్లో బెంగాలీ కంటెంట్ (81 శాతం), తమిళం (81 శాతం), తెలుగు (79 శాతం), హిందీ (75 శాతం), గుజరాతీ (72 శాతం), మలయాళం (70 శాతం), మరాఠీ (66 శాతం) , కన్నడ (66 శాతం) భాషలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తేల్చారు. ఇక టెక్ట్స్ వార్తలకు గుజరాతీ, కన్నడ కంటెంట్ భాషల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మరాఠీ, మళయాళం భాషల్లో ఆడియో కంటెంట్ వార్తలకు అధిక డిమాండ్ ఉంది.

93 శాతం మంది ఆన్‌లైన్ వార్తల కోసం యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. ఆ తరువాతి స్థానాల్లో సోషల్ మీడియా(83శాతం), చాట్ యాప్ లు (82 శాతం), సెర్చ్ ఇంజిన్లు (61 శాతం), పబ్లిషర్ న్యూస్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు (45 శాతం), ఆడియో న్యూస్ (39 శాతం), టీవీ ద్వారా 21 శాతం మంది వార్తల్ని చూస్తున్నారు. చాలా మంది యూజర్లు వాట్సాప్ లో వచ్చే వార్తలు, ఏ వెబ్ సైట్ లో కనిపించకపోతే ఫేక్ న్యూస్ గా పరిగణిస్తున్నారు. 70 శాతం మంది 60 కంటె తక్కువ పదాల్లోని వార్తల్ని ఇష్టపడుతున్నారు. 48 శాతం పెద్దదిగా ఉన్న కంటెంట్ చదువుతున్నట్లే తేల్చింది. ఆన్‌లైన్ వార్తల్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఆ తర్వాతి స్థానాల్లో క్రైమ్, స్థానిక, జాతీయ-అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Show comments