Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ

  • కోర్టు సమన్లను పట్టించుకోని టీఎంసీ ఎంపీ
  • మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్
Mahua Moitra

Mahua Moitra

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు సమన్లను పలుమార్లు జారీ చేసినప్పటికీ.. ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. మహిళలను అవమానించడంతో పాటు ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలతో మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. నదియా జిల్లాలోని కృష్ణనగర్ కోర్టు బుధవారం మహువా మొయిత్రాపై తక్షణమే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ వారెంట్ అమలు చేసిన నివేదికను ఆగస్టు 28న కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

మహువా మొయిత్రాపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు గతంలోనే ఆమెకు సమన్లు జారీ చేసింది. అయితే పలుమార్లు సమన్లు పంపినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని కోర్టు పేర్కొంది. మంగళవారం కూడా న్యాయమూర్తి.. మహువా మొయిత్రా మరుసటి రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే బుధవారం ఆమె కోర్టుకు రాలేదు. దీంతో కృష్ణనగర్ కోర్టులోని 3వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించారు.

‘‘ఈ కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడం.. నిందితురాలు కోర్టు ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అందువల్ల ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం మినహా కోర్టుకు మరో మార్గం లేదు’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మహువా మొయిత్రా తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ఆమె ఇకపై ఎప్పుడైనా కోర్టుకు హాజరుకాబోరని న్యాయవాది చెప్పినట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఆమెకు ‘‘చట్ట న్యాయస్థానం పట్ల గౌరవం లేదు’’ అని కోర్టు అభిప్రాయపడింది. అయితే మహువా మొయిత్రా కోర్టుకు వస్తే ప్రాంగణం వెలుపల ఆమెను కొందరు అడ్డుకునే లేదా వేధించే అవకాశం ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏ సెక్షన్ల కింద కేసు?

కృష్ణనగర్ పోలీసు జిల్లా ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మహువా మొయిత్రాపై మహిళల గౌరవాన్ని అవమానించడం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను దెబ్బతీయడం, క్రిమినల్ బెదిరింపులు, ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 79, 196, 299, 351, 353(2) కింద అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా పరిణామాలతో మహువా మొయిత్రాపై కోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.