NTV Telugu Site icon

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రేపే బలపరీక్ష

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30న బలపరీక్షకు ఆదేశించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన మెజారీటీని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే శివసేన నుంచి 39 మంది ఎమ్మెల్యేలు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో బలపరీక్ష కీలకంగా మారింది. మంగళవారం గవర్నర్ ను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్దవ్ ఠాక్రే తన మెజారిటీ కోల్పోయాడని వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. ఈ  నేపథ్యంలో రేపు మహారాష్ట్రలో బలపరీక్ష జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు బలనిరూపణకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధం కావాలని గవర్నర్ ఆదేశించారు. సాయంత్రం 5 గంటల వరకు డెడ్ లైన్ విధించారు. బలపరీక్షకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు.

ఇప్పటికే గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలు రేపు ముంబై బయలుదేరనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన రూములు ఖాళీ చేయనున్నట్లు తెలిసింది. గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే కూడా రేపటి ఫ్లోర్ టెస్ట్ కు ముంబై బయలుదేరుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర శాంతి, సంతోషం కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే దాదాపుగా రేపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే అయిపోయింది. రెండున్నరేళ్లు అధికారాన్ని చెలాయించిన ఈ మూడు పార్టీలు గద్దె దిగే అవకాశం ఏర్పడింది. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 144 మ్యాజిక్ ఫిగర్ అయితే.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఇటీవల వరకు 152 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో 40 పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఏక్ నాథ్ షిండే వర్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ  దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోమంత్రిత్వ శాఖను కేటాయిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.