Maharashtra Municipal Election Results: మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM అనూహ్యంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్‌లో ఒవైసీ పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి ప్రతిపక్షాలను మట్టికరిపించింది. అయితే ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభావం తగ్గిపోగా, AIMIM రాజకీయ ఆటను చెడగొట్టింది. అయితే, మొత్తం 2,869 కౌన్సిలర్ సీట్లలో AIMIM ఇప్పటివరకు 75 సీట్లలో గెలుపు సాధించగా లేదా ఆధిక్యంలో ఉంది. ఇది పార్టీకి పట్టణ రాజకీయాల్లో గణనీయమైన స్థాయిని తెచ్చిపెట్టింది.
ముంబైలో ముస్లింలు 20 శాతం పైగా ఉన్నప్పటికీ AIMIM కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. వార్డు 135: ఇర్షాద్ ఖాన్, వార్డు 134: మెహజబీన్ అతిక్ అహ్మద్, వార్డు 145: ఖైరున్నిసా హుస్సేన్.. అయితే, ఈ మూడు స్థానాలే కాకుండా, అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ ఓటు బ్యాంకును AIMIM చీల్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్)లో MIM దూకుడు
ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో AIMIM అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొత్తం 115 సీట్లలో 24 సీట్లలో గెలుపు లేదా ఆధిక్యం సాధించింది. 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఇంతియాజ్ జలీల్ రాజకీయ ప్రభావం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో AIMIM అక్కడ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది.
మాలేగావ్‌లో కింగ్‌మేకర్‌గా ఒవైసీ
ముస్లింలు అధికంగా నివసించే మాలేగావ్‌లో AIMIM సంప్రదాయ కోటగా కొనసాగుతోంది. మొత్తం 84 సీట్లలో AIMIM 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది.. ఈ పరిస్థితుల్లో AIMIM మద్దతు లేకుండా మాలేగావ్‌లో మేయర్ అవ్వడం అసాధ్యమని స్పష్టమైంది. దీంతో ఒవైసీ పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాలేగావ్ నుంచి AIMIM ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇతర నగరాల్లోనూ AIMIM ప్రభావం చూపించింది..
నాందేడ్ వాఘాలా: 14 సీట్లు
ధూలే: 8 సీట్లు
అమరావతి: 6 సీట్లు
చంద్రపూర్: తొలి విజయం నమోదు
జల్నా: 2 సీట్లు
పర్భానీ: 1 సీటు
ఈ ఫలితాలు AIMIM కేవలం సంప్రదాయ కోటలకే పరిమితం కాకుండా, మహారాష్ట్ర పట్టణ రాజకీయాల్లో తన పరిధిని విస్తరిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో AIMIM కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మాలేగావ్ లాంటి పట్టణాల్లో ఒవైసీ పార్టీ కింగ్‌మేకర్‌గా మారడం భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
