Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన

  • మహారాష్ట్రలో కరవు ఛాయలు
  • 74 శాతం తాలూకాల్లో తీవ్ర వర్షాభావం!
  • కరవు ప్రాంతాలు ప్రకటించిన ఫడ్నవిస్ సర్కార్
Maharashtra

Maharashtra

సూపర్ ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది దేశంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ఏ రాష్ట్రంలో చూసినా ఈ పరిస్థితులే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఎక్కడా కూడా వర్షాలు పడలేదు. దీంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 74 శాతం తాలూకాల్లో తీవ్ర వర్భాభావం ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో పంటలు దెబ్బతినడంతో పాటు పలు ప్రాంతాల్లో నీటి కొరత కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 తాలూకాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్రంలోని దాదాపు 74 శాతం తాలూకాలు కరవు ప్రభావానికి గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. శనివారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ ప్రకటన వెలువడింది. కరవు ప్రభావిత ప్రాంతాల్లో వర్షపాతం, భూగర్భ పరిస్థితులు, పంటల పరిస్థితి, నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు మహారాష్ట్రలో సాధారణంగా 932.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 755.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 18.8 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలోని పలు జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఛత్రపతి సంభాజీనగర్ డివిజన్‌లో సాధారణ వర్షపాతం 613.1 మిల్లీమీటర్లు కాగా.. ఈసారి కేవలం 424.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో అక్కడ ఏకంగా 30.8 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

ధారాశివ్, బీడ్ జిల్లాలు సుదీర్ఘ వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. వర్షాలు సరిగా లేకపోవడంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. పశువులకు మేత, తాగునీటి లభ్యతపైనా ఒత్తిడి పెరుగుతోంది. పుణె, నాసిక్ డివిజన్లలోనూ దాదాపు 30 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. అమరావతి, నాగ్‌పూర్ డివిజన్లలో సుమారు 27 శాతం లోటు ఉంది. కోంకణ్ ప్రాంతం మాత్రం తక్కువగా ప్రభావితమైంది. అక్కడ వర్షపాతం లోటు 6.3 శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని కనీసం ఆరు జిల్లాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో అమరావతి, సోలాపూర్, లాతూర్ వంటి జిల్లాలు ఉన్నాయి. వర్షాభావం కారణంగా సోయాబీన్, పత్తి, సజ్జలు, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు వంటి ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటుండగా.. తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తి కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

ఫడ్నవీస్ పర్యటన

ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. వాస్తవంగా ఎంత మేర పంట నష్టం జరిగిందనే విషయాన్ని క్షేత్రస్థాయి ధ్రువీకరణ అనంతరం నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో నీటి లభ్యత, వ్యవసాయ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్రలో వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం చూపే పునరావృత ప్రమాదాల్లో కరవు కూడా ఒకటిగా రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు గుర్తిస్తున్నారు.

రైతుల ఆందోళనలు

పంట నష్టాలకు పరిహారం, తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. సెప్టెంబర్ 16న కూడా రైతులు నిరసనలు చేపట్టి ప్రభుత్వం నుంచి సహాయం కోరారు. 265 తాలూకాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం, నీటి లభ్యత, రైతుల పరిస్థితిపై తదుపరి సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.