NTV Telugu Site icon

Ajit pawar: అజిత్‌పవార్‌కు భారీ మెజారిటీ.. ఎంత వచ్చిందంటే..!

Ajitpawar

Ajitpawar

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. ఊహించని ఫలితాలను సాధించింది. ఏకపక్షంగా మహాయుతి కూటమి పక్షాన ప్రజలు నిలబడ్డారు. ఇక ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భారీ విజయం సాధించారు. శనివారం వెలువడిన ఫలితాల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీ నుంచి పోటీ చేసిన యోగేంద్రపై విజయం సాధించారు. అజిత్‌ పవార్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమారుడే యోగేంద్ర. ఇదిలా ఉంటే ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్‌పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ ఓటమి పాలయ్యారు. శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం విశేషం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అజిత్ పవార్ విక్టరీ సాధించారు.

తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి గట్టి షాకిచ్చింది. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక బూస్టింగ్‌లాంటిదని కూటమి భావించింది. అధికారం కోసం ఎన్నో కలలు కంది. లోక్‌సభలో వచ్చిన ఉత్సాహమే.. అసెంబ్లీలో కూడా అదే తరహాలో ఉంటుంది అని కాంగ్రెస్ కూటమి భావించింది. తీరా ఆరు నెలలు తిరిగేసరికి అంతా తుస్‌మని పోయింది. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బొమ్మ.. బొరుసైంది. మహా వికాస్ అఘాడీ కూటమి భారీ ఓటమిని కూడగట్టుకుంది. 288 స్థానాలు ఉండగా కేవలం 50 స్థానాలకే ఇండియా కూటమి సరిపెట్టుకుంది. ఇక మహాయుతి కూటమి(ఎన్డీఏ) ఏకంగా 233 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.