Madras High Court: CJP నేత సౌరవ్ దాస్‌ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..

  • కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్..
  • పార్టీ నేత సౌరవ్ దాస్‌పై విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
  • ఆయన తల్లిదండ్రులు, నేపథ్యంపై విచారించాలని కేంద్రానికి నోటీసులు..
Cjp's Saurav Das

Cjp's Saurav Das

Madras High Court: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి, జర్నలిస్టు సౌరవ్ దాస్ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన నేపథ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని, న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఆయన తల్లిదండ్రలతో సహా వ్యక్తిగత నేపథ్యంపై విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అక్టోబర్ 30, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేయాలని హోం మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది.

పాస్‌పోర్టు, ఆధార్ రద్దు చేయాలని పిటిషన్..

కాంచీపురం జిల్లాకు చెందిన గణేష్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సౌరవ్ దాస్ నేపథ్యం, గత వివరాలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో కోరారు. సౌరవ్ దాస్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డులను రద్దు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలను బ్లాక్ చేయాలని కూడా కోరారు.

కేంద్రానికి నోటీసులు..

ఈ పిటిషన్‌పై స్పందన కోరుతూ చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి, యూఐడీఏఐ చైర్‌పర్సన్, కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ గ్రీవెన్స్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్ తరుఫున న్యాయవాది బి.జగన్నాథ్ వాదనలు వినిపించారు. సౌరవ్ దాస్ న్యాయవ్యవస్థపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన నేపథ్యంపై విచారణ అవసరమని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.