Site icon NTV Telugu

High Court: భార్యను చిత్రహింసలు పెట్టిన 85 ఏళ్ల భర్తకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court

Madras High Court

High Court: భార్యపై చిత్రహింసలు, మానసిక వేధింపులకు పాల్పడిన 85 ఏళ్ల భర్తకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆరు నెలల జైలు శిక్షతో పాటు నెలకు రూ.20 వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఇంద్ర అనే మహిళ తన భర్త ధనశీలన్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని స్థానిక కోర్టును ఆశ్రయించింది. భర్త ప్రవర్తన పైన ప్రశ్నించినందుకు, అతని వివాహేతర సంబంధంపై ఆరా తీసినందుకు, తనను మూడు సంవత్సరాలుగా ఫోన్ వాడనీయకుండా, తిండి ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..

స్థానిక కోర్టు విచారణ జరిపి, ధనశీలన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ, భర్త జిల్లా కోర్టులో అప్పీల్‌ చేయగా, “ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు” అని పేర్కొంటూ కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఇంద్ర హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం భారత సంప్రదాయంలో పవిత్ర బంధమని, కానీ అది భార్య భరించాల్సిన బాధల సంకెళ్ళుగా మారకూడదని పేర్కొంది. వృద్ధురాలైన ఇంద్ర కుటుంబ గౌరవం కోసం మౌనం పాటించినా, ఇప్పుడు న్యాయం కోరడం ప్రతీకార చర్య కాదని వ్యాఖ్యానించింది.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
“గృహహింస ఎక్కువగా నాలుగు గోడల మధ్యే జరుగుతుంది. వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండాలని ఆశించకూడదు. క్రూరత్వం అంటే కేవలం శారీరక లేదా వరకట్న హింస మాత్రమే కాదు – మానసిక, భావోద్వేగ, ఆర్థిక హింస కూడా అదే స్థాయిలో పరిగణించాలి.” భర్త వయస్సు నేరానికి కవచం కాదని, వృద్ధులకే అధిక బాధ్యత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. చివరగా, దిగువ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్ష, ₹500 జరిమానాను అలాగే కొనసాగిస్తూ, భార్యకు నెలకు రూ.20,000 భరణం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version