Made In India Light Combat Helicopters Prachand Inducted Into Indian Air Force: భారత సైన్యం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. రెండు దశాబ్దాల వారి నిరీక్షణకు ఈ రోజు ఫలితం దక్కింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్డర్(LCH) ‘ప్రచండ్’ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీటిని భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చాలాకాలం నుంచి దాడుల కోసం ఈ తరహా హెలికాప్టర్ల అవసరం ఉండేది. మరీ ముఖ్యంగా.. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో ‘ప్రచండ్’ లాంటి హెలికాప్టర్స్ ఉండాల్సిందని మన సైన్యం భావించింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆ అవసరం తీరింది. ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అనేది రెండు దశాబ్దాల పరిశోధన, అభివృద్ధి ఫలితం. భారత ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్ ప్రవేశం.. రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలరాయి. ఈ ప్రచండ్ శతృ నిఘా నుంచి సమర్థవంతంగా తప్పించుకోగలదు. రకరకాల మందుగుండు సామాగ్రిని మోసుకెళ్లడంతో పాటు త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. వివిధ భూభాగాల్లో మన సాయుధ దళాల అవసరాల్ని ఈ ప్రచండ్ సంపూర్ణంగా తీరుస్తుంది’’ అని వెల్లడించారు.
అంతేకాదు.. ఈ ప్రచండ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదని, శతృ సైన్యానికి ధీటైన సందేశం పంపే సామర్థ్యాన్ని ఈ ఎల్‌సీహెచ్ కలిగి ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అవసరమైన చురుకుదనం, అధిక ఎత్తులో పనితీరు, ఎలాంటి వాతావరణంలో నైనా పోరాటే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుందని అధికారులు కూడా చెప్తున్నారు. కాగా.. ఈ ప్రచండ్‌ను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించింది. 5 వేల మీటర్ల ఎత్తులో.. గణనీయమైన ఆయుధాలు, ఇంధనతో భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ – టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలో ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం.
కాగా.. భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు గాను స్వదేశీ పరిజ్ఞానంతోనే తేలికపాటి హెలికాప్టర్లను రూపొందించేందుకు.. 2020 మార్చిలో ప్రధాని నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. తొలుత 15 హెలికాప్టర్ల కోసం రూ. 3887 కోట్లను కేటాయించింది. వాటిలో 10 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి, మరో ఐదింటికి ఆర్మీకి కేటాయించారు. రెండు ఇంజిన్లు కలిగిన ఈ ప్రచండ్ హెలికాప్టర్ 5.8 టన్నుల బరువు ఉంటుంది.