ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి బుకింగ్ సమయాన్ని 45 రోజులకు పెంచింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బుకింగ్ సమయాన్ని 25 రోజులకు కుదిస్తూ కేంద్రం కీలక ప్రకటనం చేసింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది.
దేశవ్యాప్తంగా ఇకపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి 25 రోజులకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దేశీయ ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బుకింగ్స్ సంఖ్య గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ సోమవారం వెల్లడించారు.
ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) దేశీయ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్‌కు 25 రోజుల సమాన వ్యవధిని వెంటనే అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు ఎక్కువ రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చిన గ్రామీణ ఎల్పీజీ వినియోగదారులు కూడా పట్టణ ప్రాంత వినియోగదారులతో సమానంగా 25 రోజుల తర్వాత తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం లభించింది.
LPG బుకింగ్ గడువులో మార్పు
గతంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు వేర్వేరు బుకింగ్ వ్యవధులు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో LPG వినియోగదారులు 25 రోజుల తర్వాత రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు 45 రోజులు వేచి చూడాల్సి వచ్చేది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణల కారణంగా LPG సరఫరాపై ఒత్తిడి పెరగడంతో ఈ పరిమితులను ప్రభుత్వం గతంలో అమలు చేసింది. అయితే ప్రస్తుతం దేశీయ LPG సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో పాటు పెండింగ్ రీఫిల్ బుకింగ్స్ గణనీయంగా తగ్గాయి. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.
OMCలకు కేంద్రం కీలక ఆదేశాలు
LPG బుకింగ్ వ్యవధిలో మార్పును వెంటనే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) సమాచారం పంపింది. కొత్త 25 రోజుల బుకింగ్ వ్యవధిని ఎలాంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని OMCలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖ కాపీని కూడా మంత్రి సురేశ్ గోపీ తన ఫేస్‌బుక్ పోస్టులో షేర్ చేశారు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో LPG వినియోగించే కుటుంబాలకు గతంలో ఉన్న 45 రోజుల నిరీక్షణ నుంచి భారీ ఊరట లభించనుంది.

