Lok sabha: డీలిమిటేషన్ సహా 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.. రేపు సాయంత్రం ఓటింగ్

  • డీలిమిటేషన్ సహా 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
  • చర్చకు 207 మంది ఎంపీల మద్దతు
  • 18 గంటల చర్చ తర్వాత రేపు సాయంత్రం ఓటింగ్
Loksabha2

Loksabha2

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై విపక్షాలు ఓటింగ్ కోరాయి. దీంతో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా మూడు బిల్లులకు అనుకూలంగా 207 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇంత హఠాత్తుగా బిల్లులు తీసుకొచ్చారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

ఇక నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌తో సహా మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటు హక్కు రాజకీయ న్యాయమేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మూడు బిల్లులూ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్ర అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.

గౌరవ్‌ గగోయ్..
మహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గగోయ్ అన్నారు. ‘డీలిమిటేషన్‌కు మాత్రమే వ్యతిరేకం. మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదు.. గతంలో బిల్లు పెట్టినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పారు.. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదు.. అందుకే మార్పులు చేస్తున్నారు.. జనగణన తర్వాత డీలిమిటేషన్‌ అన్నారు.. ఇప్పుడు.. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు లింక్‌ పెడుతున్నారు.’’ అని గౌరవ్‌ గగోయ్ ఆరోపించారు.

కేసీ వేణుగోపాల్..
‘‘రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్‌ చేస్తోంది.. ఈ బిల్లుకు అసలు కారణాలు వేరే ఉన్నాయి.. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం.. 2024 నుంచే అమలు చేయమని డిమాండ్ చేశాం.. 33 శాతం మహిళా రిజర్వేషన్లు 2024లో ఎందుకు అమలు చేయలేదు.’’ అని కేంద్రాన్ని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.

అసదుద్దీన్ ఒవైసీ..
‘‘131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బిల్లు ఉంది.. దక్షిణాది ప్రాంతాల ప్రాతినిధ్యం లేకుండా బిల్లు ఉంది.’’ అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.