Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!

Kulgam Encounter

Kulgam Encounter

Kulgam Encounter Video: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరోసారి భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో లష్కర్ కమాండర్‌గా గుర్తించిన ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. అయితే, ఎన్‌కౌంటర్‌కు ముందు భద్రతా బలగాలు అతడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అతడు నిరాకరించాడు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జానాగల్‌పోరా ప్రాంతంలోని ఓ మసీదులో లతీఫ్ భట్ చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టాయి. అనంతరం అతడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి లొంగిపోవాలని సూచించాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రావాలని కోరాయి. అయితే, లతీఫ్ భట్ మాత్రం లొంగిపోవడానికి ససేమిరా అన్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉగ్రవాది మొదట అరబిక్ భాషలో ప్రార్థన చేస్తున్నట్లు వినిపిస్తోంది. అనంతరం భద్రతా బలగాల విజ్ఞప్తికి సమాధానమిస్తూ.. “నేను బయలుదేరాను. నాకు అల్లాహ్‌ను కలవాలని ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అల్లాహ్‌ను చూస్తాను.. అల్లాహ్ ప్రవక్తను కలుస్తాను” అంటూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది. ఈ సందర్భంగా అతడు “అల్లాహు అక్బర్” అని పలికాడు.

వీడియో కాల్‌లో భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ లతీఫ్‌తో మాట్లాడాడు. “లతీఫ్ భాయ్.. మీతో మాట్లాడుతున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? లొంగిపోండి.. ఆగండి.. నేను అక్కడికి వస్తాను” అంటూ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీనికి సమాధానంగా లతీఫ్ భట్.. “నాతో అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. నాకు అల్లాహ్ ఒక్కడే సరిపోతాడు” అంటూ లొంగిపోవడానికి నిరాకరించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, భద్రతా బలగాల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. వీడియోలో ఉగ్రవాది పలికిన ‘అల్లాహు అక్బర్’ అనేది అరబిక్ భాషకు చెందిన పదబంధం. దీని అర్థం ‘అల్లాహ్ అత్యంత గొప్పవాడు’ లేదా ‘దేవుడు అందరికంటే గొప్పవాడు’ అని. ఇస్లాంలో దీనిని ‘తక్బీర్’ అని పిలుస్తారు. ముస్లింలు ప్రార్థనలతో పాటు వివిధ సందర్భాల్లో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు.

లతీఫ్ భట్ హతమవడంతో కుల్గామ్ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి పాత్రపై మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అంతకుముందు కుల్గామ్‌లోని CRPF క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో కుట్రకు సంబంధించిన ఆధారాలను NIA సేకరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నాయి.