NTV Telugu Site icon

Krishna Janmabhoomi-Shahi Eidgah: మథుర షాహీ ఈద్గా కేసులో జులై 20న విచారణ

Mathura1

Mathura1

దేశంలో ఓ వైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతోంది. జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయం అని తమకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేయడంతో వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది. తాజాగా దీనిపై అంజుమన్ ఇంతేజామియా సుప్రీంలో పిటిషన్ వేయగా.. శుక్రవారం సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వారణాసి జిల్లా కోర్ట్ కు కేసును బదిలీ చేసింది. వీడియో సర్వేలో దొరికిన శివలింగాన్ని రక్షించాలని… ఆదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే తాజాగా కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం ప్రస్తుత వార్తల్లోకి చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ మథుర ఉన్న కత్రా కేశవ్ దేవ్ ఆలయ భూమి, షాహీ ఈద్గా వివాదాన్ని విచారించేందుకు ఇటీవల మథుర కోర్ట్ అంగీకరించింది. కత్తా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల భూమిపై ఈ వివాదం చెలరేగింది. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీదును తొలగించాలని గోపాల్ బాబా 2021 సెప్టెంబర్ 20 మథుర సివిల్ జడ్జ్ ( సీనియర్ డివిజన్) కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే కోర్ట్ జూలై 20న ఈ కేసు తదుపరి విచారణ తేదీగా నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ బార్ కౌన్సిల్ శుక్రవారం నోవర్క్ కాల్ ఇచ్చినందున ఈ కేసును జూలై 20కి వాయిదా వేసింది. మథుర జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసును అదనపు సివిల్ జడ్జ్ ( ఫాస్ట్ ట్రాక్) నీరజ్ గౌండ్ కు బదిలీ చేసింది. యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, ఇంతేజామియా కమిటీ, షాహీ మసీదు ఈద్గా, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌లు ఈ కేసులో వాద-ప్రతివాదులుగా ఉన్నారు.

ఇప్పటి వరకు శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై మసీదును మార్చాలనే డిమాండ్ పై 11 పిటిషన్లు మథురలోని వివిధ కోర్టుల్లో దాఖలు అయ్యాయి. శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయాన్ని అనుకుని ఉన్న షాహీ మసీదులో ప్రార్థనలను నిషేధించాలని పలు పిటిషన్లలో పేర్కొన్నారు.