కోల్‌కతా: దక్షిణ కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో దుర్గా పూజ పండల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అమ్మవారిని దర్శించుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హరిదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన సంగీతా రాణా అనే మహిళ సోమవారం అర్ధరాత్రి బెహాలాలోని నూతన్ దళ్ పూజ పండల్ ను సందర్శించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని చూసిన కొద్ది సేపటికి ఆమె ఎగ్జిట్ గేట్ కుప్పకూలిపోయింది. డ్యూటీలో అధికారులు వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.
మృతురాలు దీర్ఘ కాలంగా అస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో మహిళ చనిపోయిందంటూ ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ సపోర్ట్ కోసం పదే పదే పోలీసులకు తెలిపినప్పటికి పట్టించుకోలేదని వారు ఆరోపించారు. వచ్చిన అంబులెన్స్‌లో కూడా ఆక్సిజన లేకపోవడం దురుదృష్టకమన్నారు. పండల్ లోపల మరొక సందర్శకుడితో జరిగిన వాగ్వాదం తర్వాత ఆమె అస్వస్థతకు గురైందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సంగీతా రాణా మరణంపై దర్యాప్తు ప్రారంభించామని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని పోలీసులు వెల్లడించారు.
