Kishan Reddy Speech In Tourism Working Group Meeting: ప్రకృతితో మమేకమై జీవించడమే భారతీయ జీవన విధానమని.. అలాంటి విధానాన్ని మళ్లీ ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘మిషన్ లైఫ్’ను ప్రారంభించారని కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులు అడవుల్లో ప్రకృతితో సహజీవనం చేస్తూ.. అదే ప్రకృతిని తమ దైవంగా భావించడమే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్ఫూర్తి అని వెల్లడించారు. శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సమావేశాల సందర్భంగా సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. యావత్ భూమండలాన్ని తర్వాతి తర్వాలకు భద్రంగా అందించేందుకు దేశం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, అందులో భాగంగానే మోడీ ‘మిషన్ లైఫ్’ను ఆచరణలోకి తీసుకొస్తున్నారని, ఈ దిశగా అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.
Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా
ప్రధాని మోడీ చేపట్టిన ‘ మిషన్ లైఫ్’ను UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్) స్వీకరించడం.. ప్రపంచవ్యాప్తంగా దీని అమలుపై ప్రత్యేక దృష్టి కేటాయించేలా కార్యాచరణ రూపొందించడం.. మన దేశానికి గర్వకారణమని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రకృతి సంరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి గొప్ప ఆస్తులని.. ప్రకృతిని ఆరాధిస్తూ దేశంలో లెక్కలేనన్ని పండగలు జరుగుతుంటాయని తెలిపారు. పురాతన నాగరికతల్లో ఒకటైన భారతదేశంలో.. ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుందని, వివిధ పండగలు, వివిధ మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు భారత్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నారు. భారత పర్యాటక రంగ అభివృద్ధిలో ఇవన్నీ ప్రత్యేకమైన భూమిక పోషిస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ తన నెలవారి రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లోనూ దీని గురించి పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన.. యువ టూరిజం క్లబ్స్, టూరిజం పోలీస్, మౌలికవసతుల కల్పన, అనుసంధానత, భారత్ గౌరవ్ రైళ్లు తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో పాటు వివిధ దేశాల ఎంబసీల్లో పర్యాటక అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఆయా దేశాలనుంచి మన దేశానికి పర్యాటకులను ప్రోత్సహించేలా చేపడుతున్న చర్యలనూ ఆయన వెల్లడించారు.
Dimple Hayathi: నేను డీసీపీని ఇబ్బంది పెట్టలేదు.. అంతపెద్ద ఆఫీసర్‌ను నేనేం చేస్తాను
వివిధ రాష్ట్రాలతో కలిసి పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 166 దేశాలకు ఈ-టూరిస్టు వీసాలు అందించడం, ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత సరళతరం చేయడం, భారత్‌లో టూరిస్టు గైడ్లు, టాక్సీ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, మందిరాల పూజారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పర్యాటకులకోసం రవాణా ఏర్పాట్లు, ఇతర కనీస అవసరాల కేంద్రాలు, చెత్త నిర్వహణ కోసం సదుపాయాలు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి శ్రీ జితేందర్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ తోపాటు సభ్యదేశాల, ఆతిథ్య దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.