NTV Telugu Site icon

Heart Surgery: ప్రాణాలు కాపాడటానికి కొద్దిసేపు చంపేశారు.. ప్రభుత్వ హాస్పిటల్‌లో అరుదైన ఆపరేషన్‌

Heart Surgery

Heart Surgery

Heart Surgery: రోగి ప్రాణాలు కాపాడటానికి సర్జరీ(ఆపరేషన్‌) చేసే సమయంలో మత్తుమందును రోగికి ఇస్తారు. అయితే ఇలా మత్తుమందును వారికి చేసే సర్జరీని బట్టి ఉంటుంది. మేజర్‌ సర్జరీ అయితే శరీరం మొత్తంగా కదలకుండా ఉండేలాగా మత్తు మందు ఇస్తారు. అలా కాకుండా ఏదో ఒక శరీర భాగానికి సర్జరీ చేసేటట్టయితే.. వాటి వరకే మత్తుమందు ఇస్తారు దీనినే అనస్థీషియా అంటారు. కానీ లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాత్రం ఒక మహిళకు గుండెకు సంబంధించిన మేజర్‌ ఆపరేషన్‌ చేయాల్సి రాగా.. అందుకోసం ఆమెను కాసేపు చంపేశారు. అంటే పూర్తిగా చంపేశారని కాదు.. కొన్నిగంటలపాటు ఎటువంటి కదలిక లేకుండా ఉండేలాగా డీఫ్‌ హైపోథెర్మిక్‌ సర్క్యులేటరీ అరెస్ట్(డీహెచ్‌సీఏ) ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ చేయడం ద్వారా రోగి 6 నిమిషాలపాటు మరణించేలా చేస్తారు. అలా చేసి 28 ఏళ్ల మహిళకు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను చేసి.. మహిళను బ్రతికించారు.

Read also: Pak Smugglers: పంజాబ్‌లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా హెరాయిన్‌ స్వాధీనం

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ వైద్యులు ఓ యువతి ప్రాణం కాపాడటం కోసం ఈ అరుదైన డీహెచ్‌సీఏ ప్రక్రియను చేపట్టారు. అయోధ్యకు చెందిన 28 ఏళ్ల మహిళ గుండె సంబంధిత సమస్యతో బాధపడేది. ఆమె గుండె నుంచి మిగతా శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాల్లో సమస్య ఉంది. దీంతో ఆమెను తిరిగి మాములు మనిషి చేయడం కోసం లక్నో డాక్టర్లు డీహెచ్‌సీఏ ప్రక్రియ ద్వారా 6 నిమిషాలపాటు ఆమె మరణించేలా చేశారు. ఈ పద్ధతిలో ఆమె శరీరాన్ని చల్లబర్చారు. తద్వారా ఆమె శరీరంలోని అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోయేలా చేయడంతో.. మనిషి మరణించిన స్థితిలోకి వెళ్తాడు. ఈ టెక్నిక్ చేయడం మూలంగా రోగికి నరాల బలహీనత రాకుండా 30 నిమిషాలపాటు పేషెంట్‌ను 18 డిగ్రీల సెల్సియస్ వద్ద అచేతనంగాఉంచొచ్చు. మస్తిష్క రక్షణలో హైపోథెర్మియా అనేది ప్రధాన పద్ధతి. ఫార్మాలాజికల్ పద్ధతులు, గ్లూకోజ్ నియంత్రణ, హై మాడ్యిలేషన్, యాసిడ్ బేస్ మేనేజ్‌మెంట్ తదితర న్యూరో ప్రొటెక్టివ్ స్ట్రాటజీలను ఇందులో ఉపయోగిస్తారు. మహిళ బృహద్దమనిలో తీవ్రమైన సమస్య ఉంది.. దానివల్ల రక్తనాళం గోడ ఉబ్బిపోయింది.. దీన్ని అవోర్టిక్ సూడో అనేరిజం అంటారని వైద్యులు తెలిపారు. డీహెచ్‌సీఏను చేపట్టడానికి ముందు డాక్టర్లు మరో పద్ధతిలో శస్త్రచికత్స చేసినప్పటికీ.. దాని వల్ల ఆమె రక్త నాళం లీకయ్యి.. ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో డీహెచ్‌‌సీఏ చేపట్టిన డాక్టర్లు.. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఆమె కోలుకుంటున్న తీరును జాగ్రత్తగా పరిశీలించారు. ఆమె కోలుకోగానే వెంటిలేటర్ తీసేసిన వైద్యులు.. ఓ వారం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. డీహెచ్‌సీఏ ప్రక్రియ కొత్తదేమి కాదని.. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను సరిచేయడానికి 1970ల నుండి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఈ టెక్నిక్ ముఖ్యంగా గర్భిణులు, శిశువులు మరియు అప్పుడప్పుడు పెద్ద పిల్లలలో సైతం ఉపయోగించబడుతుందని.. డీహెచ్‌సీఏ రోగి కార్డియోపల్మోనరీ బైపాస్‌లో ఉండాల్సిన సమయాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ డీహెచ్‌సీఏ ప్రక్రియను ఉపయోగిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.