NTV Telugu Site icon

Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం

Kerala Savari

Kerala Savari

Kerala starts government-owned online cab service: వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. గతంలో కేరళ సొంతగా ప్రభుత్వ ఓటీటీ ‘సీ స్పెస్’ ని ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోనే కేరళ ప్రభుత్వం ప్రజలకు మరన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేరళ ప్రభుత్వం సొంతగా ‘‘ క్యాబ్ సర్వీస్’’ ప్రారంభించింది. ‘‘ కేరళ సవారీ’’ పేరుతో ప్రభుత్వం సొంతగా ఏర్పాటు చేసిన క్యాబ్ సర్వీస్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిడిచే దేశంలోని మొట్టమెదటి ఆన్ లైన్ టాక్సి సర్వీస్ ‘ కేరళ సవారి’నే. ఇది ప్రయాణికులకు సరసమైన ధరల్లోనే సేవలు అందించబోతోంది. ఈ పథకం ద్వారా ఆటో రిక్షాలు, టాక్సీ కార్మకులకు వేతన హామీ ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక శాఖ ఈ ఆన్ లైన్ క్యాబ్ సర్వీసును నిర్వహిస్తుంది.

రద్దీ సమయాల్లో ఎలాంటి ధరల్లో మార్పు లేకుండా.. ఇతర క్యాబ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా కేరళ సవారీలో స్థిరమైన ధరలు ఉండనున్నాయి. పీక్ అవర్స్ లో ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లు ఒకటిన్నర రెట్టు ఛార్జీలను పెంచుతాయి. కేరళ సవారీ మాత్రం 8 శాతం సర్వీస్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇతర క్యాబ్ సర్వీసులు మాత్రం 20 నుంచి 30 శాతం వసూలు చేస్తాయి.

Read Also: Congress: కాశ్మీర్ లో స్థానికేతరుల ఓటు హక్కుకు వ్యతిరేకం.. న్యాయ పోరాటం

మహిళలకు రక్షణ

కేరళ సవారి పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజెన్ల రక్షణను మొదటి ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ కేరళ సవారీలో చేరాలనుకునే డ్రైవర్లు ముందుగా పోలీసుల క్లియరెన్స్ పొందాలి.. సరైన శిక్షణ పొందాల్సి ఉంటుంది. యాప్ లో ‘‘పానిక్ బటన్ సిస్టమ్’’ ప్రవేశపెట్టారు. వాహనం ప్రమాదంలో ఉన్నప్పుడు, మరేదైనా అత్యవసర సమయంలో పానిక్ బటన్ నొక్కితే వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బందికి వెంటనే కనెక్ట్ అవుతుంది. బటన్ నొక్కిన వెంటనే నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే వాహనాలకు జీపీఎస్ అమరుస్తారు. ఇందుకోసం 24 గంటలు కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

ముందుగా రాజధానిలో తరువాత మరిన్ని పట్టణాల్లో సేవలు

కేరళ సవారీ యాప్ బుధవారం అర్థరాత్రి నుంచి ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. ముందుగా రాజధాని తిరువనంతపురంలో కేరళ సవారీ సేవల్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అక్కడ 321 ఆటోరిక్షాలు మరియు 228 కార్లు సహా 541 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. దీని తర్వాత కొచ్చి, కొల్లాం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్ ప్రాంతాల్లో ఈ కేరళ సవారీ సేవలను ప్రారంభించనున్నారు.