Site icon NTV Telugu

Police Brutality:అమానుష ఘటన.. బాలింతపై పోలీస్ దాడి..

Untitled Design

Untitled Design

కేరళ రాష్ట్రం కొచ్చిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ తరహా దారుణానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింత పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై దౌర్జన్యం చేయడం అమానవీయమని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, 2024 జూన్ 18న కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ చంద్రన్, శైమోల్ ఎన్.జే అనే బాలింతను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించడంతో, అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది.

ఈ ఘటన జరిగినప్పటికీ, దాదాపు ఏడాది పాటు న్యాయపోరాటం కొనసాగిన తర్వాతే సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. శైమోల్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఆ ఫుటేజ్ ఆమెకు అందింది. ఆ వీడియోలే పోలీస్ అధికారి దౌర్జన్యానికి ప్రత్యక్ష ఆధారాలుగా మారాయి.

శైమోల్ భర్త బెన్ జో, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తమ పర్యాటక వసతి కేంద్రం వద్ద ఇద్దరు వ్యక్తులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. వారు దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఈ వీడియో తీసిన కారణంగా బెన్ జోను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలతో కేసులో మూడో నిందితుడిగా చేర్చారు.

భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న శైమోల్ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు, ఎస్‌హెచ్‌వో ప్రతాప్ చంద్రన్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే అధికారి ఆమెను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. తాను బాలింతనని పలుమార్లు పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని శైమోల్‌తో పాటు ఆమె భర్త ఆరోపించారు.

ఈ ఘటన వివరాలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు రాష్ట్ర డీజీపీ చంద్రశేఖర్ వరకు చేరాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చివరకు సంబంధిత పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version