NTV Telugu Site icon

Kerala: కేరళలో దంచికొడుతున్న వానలు… 7 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kerala1

Kerala1

కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో తుఫాన్ ప్రసరణతో పాటు ఉత్తర కేరళ నుంచి అల్పపీడన ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులతో బలమైన గాలులతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయని కేరళ రాష్ట్ర వివత్తు నిర్వహణ అథారిటీ అంచానా వేసింది. రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.

భారీ వర్షాల వల్ల కేరళలో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెలాఖరులో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే కేరళలో తొలకరి జల్లులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

మరోవైపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్( ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటికే ఐదు టీములను కేరళకు రప్పించింది. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు నదులు, ఇతర నీటి వనరులకు దూరంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కొండ ప్రాంతాలకు, సముద్ర పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా 5 రోజుల ముందే మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ అంచానా వేసింది.