Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా

  • ప్యూర్టో రికోకు కజియా పయనం
  • మెరూన్ చీరలో ప్రత్యేక ఆకర్షణ
  • 19 ఏళ్లకే అందాల కిరీటం
  • ప్రపంచ వేదికపై భారత్ ఆశలు
Kaziah Liz Mejo

Kaziah Liz Mejo

అందాల భామల ప్రపంచంలో భారత్ తలమానికంగా నిలిచేందుకు మరో అరుదైన వేళ ఆసన్నమైంది. గత ఆగస్టులో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్న కేరళకు చెందిన 19 ఏళ్ల వయసు అందాల తార కజియా లిజ్ మేజో.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వేదికపై తలపడేందుకు విమానం ఎక్కేసారు. ప్రతిష్టాత్మక 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో మన దేశం తరఫున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి ప్యూర్టో రికోకు బయలుదేరిన ఈ ముద్దుగుమ్మకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు నీరాజనాలు పట్టారు. దేశం మొత్తం గర్వపడేలా గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటేందుకు ఆమె అడుగుపెడుతున్న తీరు యువతలో అంతులేని ఉత్సాహాన్ని నింపుతోంది.

సాంప్రదాయం ఉట్టిపడేలా మెరూన్ చీరలో అప్సరసలా..

అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్న వేళ కజియా ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ డిజైనర్ సమంత్ చౌహాన్ తీర్చిదిద్దిన ముదురు ఎరుపు (డీప్ మెరూన్) రంగు చీరలో ఆమె రాజసంగా కనిపించారు. చీరపై మెరిసే బంగారు దారపు కుట్లు, అప్లిక్ డిజైన్లు ఆమె అందాన్ని మరింత ఇనుమడింపజేశాయి. తలపై మిస్ యూనివర్స్ ఇండియా కిరీటంతో, మెడలో అందమైన చోకర్‌తో ఆమె ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వస్తున్న తీరు చూసేవారికి కనువిందు చేసింది. విమానాశ్రయంలో ఆమెను చూసేందుకు గుమిగూడిన అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు.

లా చదువుతూనే కిరీటాన్ని కైవసం చేసుకున్న మల్టీటాలెంటెడ్ బ్యూటీ

కేవలం పంతొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఇంతటి ఘనత సాధించడం సాధారణ విషయం కాదు. మోడలింగ్ రంగంలో దూసుకుపోతూనే, మరోవైపు లా (న్యాయశాస్త్రం) చదువును కొనసాగిస్తున్న అంకితభావం ఆమె సొంతం. చదువుతో పాటు మంచి శాస్త్రీయ నర్తకిగా, అద్భుతమైన వక్తగా, నటిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’ పోటీల్లోనూ భారతదేశానికి రన్నరప్ నిలిచి సత్తా చాటిన కజియా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. జైపూర్‌లో జరిగిన హోరాహోరీ పోటీల్లో వేలాది మందిని వెనక్కి నెట్టి కిరీటాన్ని దక్కించుకున్న ఆమె, ఇప్పుడు ప్యూర్టో రికో గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.