Karnataka: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును చిత్రదుర్గ సెషన్స్ కోర్టు సోమవారం సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. శరణరును పోలీసులు చిత్రదుర్గ జిల్లా జైలుకు తరలించారు. నేటితో ఆయన 4రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణరు ముందస్తు బెయిల్‌ను కోరుతూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శనివారం వాయిదా వేసింది. నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్‌ను కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాగా.. బెయిల్ దరఖాస్తుపై అభ్యంతరం తెలపాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు సోమవారం కోరింది. పీఠాధిపతి వైద్య కారణాలతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిత్రదుర్గ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Police Fighting: మద్యం మత్తులో కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. వీడియో వైరల్
గురువారం తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో శరణరును కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోక్సో చట్టం కింద మురుఘా శివమూర్తిపై ఏ-1 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం బాలికలు రెండేళ్లుగా వేధింపులకు గురయ్యారు. బాధిత విద్యార్థినుల్లో ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అట్రాసిటీ చట్టం కేసు కూడా నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు చిత్రదుర్గ జిల్లా ఎస్పీ నోటీసు జారీ చేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది.
