Minister Aswath Narayan sensational comments: కర్ణాటకలో వరసగా యువకుల హత్యలు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఇటీవల బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ నెట్టారును దక్షిణ కన్నడ జిల్లా బెల్లారే ప్రాంతంలో కొంత మంది దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అయింది. గతంలో హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్తను కూడా ఇదే విధంగా హత్య చేయడంతో బీజేపీ పార్టీతో పాటు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ హత్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అన్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు రూ. 25 లక్షల చెక్కును అందించారు సీఎం బస్వరాజ్ బొమ్మై.
Read Also: O Panneerselvam: త్వరలో బీజేపీలోకి ఓపీఎస్..
ఇదిలా ఉంటే వరసగా బీజేపీ కార్యకర్తలను హత్య చేస్తున్న క్రమంలో అక్కడి రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఐటీ మినిస్టర్ అశ్వథ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ నెట్టారు హత్య నేపథ్యంలో..ఎన్ కౌంటర్లకు సమయం వచ్చిందని.. రాబోయే రోజుల్లో ఇలాంటి హత్యలు జరగకుండా చూస్తామని అన్నారు. కొంతమంది వ్యక్తులు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని.. ఇలాంటి వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రవీణ్ నెట్టార్ హత్య తరువాత, మంగళూర్ శివారు సూతర్ కల్ లో మరో హత్య జరిగింది. గురువారం జరిగిన ఈ హత్యలో మహ్మద్ ఫాజిల్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మంగళూర్ సిటీ శివారు ప్రాంతాలైన సూరత్ కల్, ముల్కీ, బజ్ పే, పణంబూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ముస్లింలు తమ ఇళ్లలోనే ఉండీ ప్రార్థనలు చేస్తుకోవాలని పోలీసులు ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఫాజిల్ అంత్యక్రియల్లో భారీగా జనాలు పాల్గొన్నారు.