Site icon NTV Telugu

Karnataka: నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ

Karnatakahomeminister

Karnatakahomeminister

బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనంటూ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని పలువురు మహిళలు నిలదీశారు.

తాజాగా ఇదే అంశంపై హోంమంత్రి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మహిళల భద్రత గురించి ఆలోచించే వ్యక్తిని.. నిర్భయ నిధులను సక్రమంగా ఉపయోగిస్తున్నామని.. అలాంటిది తప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తానన్నారు. అయినా కూడా తన వ్యాఖ్యల వల్ల ఏ మహిళ అయినా బాధ పడుంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. స్త్రీ సమాజం క్షమించాలని కోరుతున్నానన్నారు.

బెంగళూరులో గత వారం ఇద్దరు యువతులు వీధిలో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన యువకుడు అసభ్యకరంగా తాకి లైంగికంగా వేధించి పరారయ్యాడు. అయితే ఈ ఘటనతో అమ్మాయిలిద్దరూ షాక్‌కు గురయ్యారు. భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదే అంశంపై హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతాయని వ్యాఖ్యానించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ హోంమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా క్షమాపణ చెప్పారు.

Exit mobile version