బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యారావు కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఆమె వీఐపీ ప్రోటోకాల్ ఉపయోగించుకుని సులువుగా బయటపడిపోయింది. అయితే ఇటీవల డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. దాదాపు రూ.12 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె అరెస్ట్ తర్వాత.. ప్రోటోకాల్ దుర్వినియోగం అయినట్లుగా గుర్తించారు.
తాజాగా ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం రన్యారావు తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి రామచంద్రరావు పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. వారంలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గతంలో రామచంద్రరావుపై కూడా అనేక ఆరోపణలు ఉన్నారు. కోట్లాది రూపాయిలు మాయం చేసినట్లుగా ఆయనపై అనుమానాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.
రన్యారావు.. మొబైల్ డేటాను పరిశీలించగా తరుణ్ రాజుతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రన్యారావుకు ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. కానీ ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ రాజుతో రన్యారావుకు సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. కాల్ డేటా ప్రకారం తరుణ్ రాజుతోనే రన్యారావు సంబంధం కొనసాగించినట్లుగా అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ రవాణాలో తరుణ్ రాజు పాత్ర ప్రముఖంగా తేలింది. ప్రస్తుతం తరుణ్ రాజును లోతుగా విచారిస్తున్నారు. ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టనున్నారు.
ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రన్యారావును తనిఖీ చేయగా రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె ఇంటి దగ్గర సోదాలు చేయగా కోట్ల రూపాయుల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎక్కువగా తరుణ్ రాజుతో రన్యారావు సంభాషించినట్లుగా కాల్ డేటాను బట్టి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రన్యారావు-తరుణ్ రాజు స్నేహితులుగా కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
గత సంవత్సరంలో రన్యారావు దాదాపు 30 సార్లు దుబాయ్‌కి వెళ్లొచ్చింది. కేవలం 15 రోజుల్లోనే నాలుగు ట్రిప్పులు తిరిగింది. ప్రతి ప్రయాణంలోనూ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని వర్గాలు పేర్కొన్నాయి. అయితే దర్యాప్తును రహస్యంగా ఉంచాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అయితే సోమవారం జడ్జి ముందు ఆమె మాట్లాడుతూ.. తనను కొట్టలేదు గానీ.. మాటలతో హింసిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను డీఆర్ఐ అధికారులు తోసిపుచ్చారు. ఆమె సరైన సమాధానం ఇవ్వడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ప్రతి ప్రశ్నకు మౌనంగా ఉంటుందని జడ్జికి అధికారులు వెల్లడించారు.