Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ధరించిన ఓ రాజవంశ ఆభరణం వివాదానికి దారితీసింది. దీపావళి సందర్భంగా ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్టుపై పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్ అల్-కుర్సీ’ వచనం చెక్కి ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అబ్బాస్ హఫీజ్ కరీనా కపూర్, ఆమె స్టైలిస్ట్ రియా కపూర్లకు లీగల్ నోలీసులు పంపించారు.
దీపావళి సందర్భంగా కరీనా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటో వివాదానికి కారణమైంది. ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్‌పై ఖురాన్‌లోని ఆయత్ అల్ కుర్సీ వచనం చెక్కి ఉందని, కరీనా ధరించిన ఆభరణాలు దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినవని ఆమె స్టైలిస్ట్ రికా కపూర్ పేర్కొన్నారు. ఈ ఆభరణాలు భోపాల్ రాజకుటుంబ వారసత్వ సంపదగా, సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ద్వారా కరీనాకు చేరినవిగా రియా వివరించారు.
అయితే, లాకెట్ ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులపై కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు. పవిత్ర ఖురాన్ వచనం చెక్కిన ఆభరణాన్ని మతపరమైన గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రదర్శించబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాకెట్‌ను సోషల్ మీడియాలో ప్రదర్శించిన తీరు ముస్లిం సమాజంలోని కొంతమంది సభ్యులతో పాటు భోపాల్ పూర్వ రాజకుటుంబ సంప్రదాయాలకు సంబంధించిన వారి మనోభావాలను దెబ్బతీసిందని అబ్బాస్ హఫీజ్ తన నోటీసులో ఆరోపించారు.

