Site icon NTV Telugu

Kanpur Man Leave Letter For Wife: భార్య అలిగింది.. మూడు రోజుల సెలవు ఇవ్వండి

Man Seeks Leave For Wife

Man Seeks Leave For Wife

Kanpur Man Seeks 3 Days Leave To Bring Back His Wife: మనకు (ఉద్యోగులకు) సెలవు కావాలంటే ఏం చేస్తాం.. ఆరోగ్యం బాలేదనో, ఇంట్లో ఏదో పెద్ద సమస్య వచ్చిందనో, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నామనో కారణాలు చెప్తాం. ఇంకొందరైతే.. మరో అడుగు ముందుకేసి, బతికే ఉన్న తమ తాత-ముత్తాలు చనిపోయారనో రీజన్స్ పేర్కొంటారు. కానీ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అందరి కంటే భిన్నంగా ఓ విచిత్రమైన కారణం చెప్తూ సెలవు కోరాడు. అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు మూడు రోజులపాటు సెలవు కావాలని ఉన్నతాధికారికి లీవ్ లెటర్ రాశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హమ్షాద్ అహ్మద్ బేసిక శిక్షా అధికారిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల ఓ చిన్న విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో అలిగిన భార్య, తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఫోన్ చేసి రప్పించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకుండా పోయింది. అందుకే, అత్తారింటికి వెళ్లి, తన భార్యని బుజ్జగించి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఇందుకు ఆఫీస్ నుంచి సెలవు కావాలి కదా! తప్పుడు అబద్ధాలు చెప్పడం కన్నా, నిజం చెప్తే తనకు సెలవు మంజూరు అవుతుందని అనుకున్నాడో ఏమో.. భార్యని బుజ్జిగించి ఇంటికి తీసుకురావడం కోసం తనకు మూడు రోజుల సెలవు కావాలని ఓ లీవ్ లెటర్ ఉన్నతాధికారికి రాశాడు.

‘‘సార్.. ఇటీవల నాకు, నా భార్యకి మధ్య ‘ప్రేమ-గీమా’ విషయమై గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల విభేదాలు ఏర్పడ్డంతో నా భార్య ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇంటికెళ్లింది. దీంతో నేను మానసికంగా కుంగిపోతున్నాను. నా భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ఊరికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి, నాకు మూడు రోజుల పాటు సెలవు మంజూరు చేయగలరని మనవి’’ అంటూ అహ్మద్ లేఖ రాశాడు. దీన్ని ఆ పై అధికారి లీక్ చేశాడో లేక ఎలా బయటకొచ్చిందో తెలీదు కానీ.. ప్రస్తుతానికి ఈ లీవ్ లెటర్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీని మీద నెటిజన్లు జోకులు వేసుకుంటూ, సరదాగా నవ్వుకుంటున్నారు.

Exit mobile version