Site icon NTV Telugu

Raju Talikote: విషాదం.. షూటింగ్‌లో ఉండగా కన్నడ హాస్యనటుడు హఠాన్మరణం

Rajutalikote

Rajutalikote

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌లో ఉండగా హాస్యనటుడు రాజు తలికోటే(59) హఠాన్మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాజు తాలికోటే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని ఉడిపిలో సినిమా షూటింగ్‌లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రాజు తాలికోటే రంగస్థల నటుడు. అనేక ప్రశంసలు అందుకున్నారు. అయితే తాలికోటేకు గతంలో కూడా గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. అయితే మంగళవారం షూటింగ్‌లో ఉండగా తీవ్రమైన పోటు రావడంతో కోలుకోలేకపోయారని ఆయన కుమారుడు భరత్ తెలిపాడు. ‘‘మా నాన్నగారికి ఇద్దరు భార్యలు.. కానీ మేమందరం కలిసి సామరస్యంగా పెరిగాము.’’ అని భరత్ చెప్పాడు. చిక్కసిందగి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజు తాలికోటే మరణంపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రఖ్యాత నాటక నటుడు, హాస్యనటుడు, ధార్వాడ్ రంగాయణ దర్శకుడు రాజు తాలికోటే గుండెపోటుతో మరణించడం తీవ్ర బాధాకరం. అనేక కన్నడ చిత్రాలలో నటించి అపారమైన ప్రజాదరణ పొందిన ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. రాజు తాలికోటే ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని దేవుడు ప్రార్థిస్తున్నాను.’’ అని డీకే.శివకుమార్ పేర్కొన్నారు.

రాజు తాలికోటే..
రాజు తాలికోటే 1965లో జన్మించారు. తాలికోటేలో పుట్టి పెరిగినందున.. ఆయన పేరు రాజు తాలికోటేగా ప్రసిద్ధి చెందారు. ఆ పేరుతోనే నాటక, సినిమాల్లో ఖ్యాతిని పొందారు. రాజు తాలికోటే తల్లిదండ్రులు కూడా నాటక కళాకారులే. వారు ‘‘శ్రీగురు ఖస్గతేశ్వర నాట్య సంఘం’’ అనే నాటక బృందాన్ని నడిపారు. రాజు తాలికోట్‌ శ్రీగురు ఖస్గతేశ్వర మఠంలో చదువుకున్నారు. అక్కడే బాల నటుడిగా కూడా నటించాడు. కేవలం 4వ తరగతి వరకే చదువుకున్నారు. తల్లిదండ్రుల మరణం తర్వాత చదువు ఆగిపోయింది. అనంతరం హోటల్‌లో పని చేశారు. అటు తర్వాత లారీ క్లీనర్‌గా కూడా పనిచేశారు. రంగస్థల కళలోని వివిధ రంగాలలో అనుభవాన్ని సంపాదించి తల్లిదండ్రుల నాటక బృందాన్ని కొనసాగించారు.

రాజు మొదటి భార్య పేరు ప్రేమ.. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ భార్య కూడా సింధనూరుకు చెందిన ప్రేమ. ఇద్దరు భార్యల పేర్లు కూడా ప్రేమనే. వీరికి షాజీద, షబ్బు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజు తాళికోటే మొదటి సినిమా ‘‘హెందతి అందరే హెందతి’, ఆ తర్వాత మనసారే, పంచరంగి, రాజధాని, లైఫ్‌ ఇష్టేనే, అలెమారి, మైనా, టోపీవాలా, పంజాబీ హౌస్‌తో సహా అనేక సినిమాల్లో నటించారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 7 రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు.

రాజు తళ్లికోటే ప్రత్యేకంగా క్యాసెట్ రికార్డింగ్ కోసం అనేక నాటకాలు రాశారు. 15,000 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. కలియుగడ కుడుక నాటకం ద్వారా ఆయన ప్రసిద్ధి చెందారు. 1990లలో ఈ నాటకం ఆడియో క్యాసెట్ రికార్డ్ చేయబడింది. అనంతరం ఆయన అపారమైన ప్రజాదరణ పొందారు. కుడుకర సామ్రాజ్యం, హట్టిగుడి లక్కవ్వ వంటి నాటకాలతో కీర్తి పొందారు.

Exit mobile version