Site icon NTV Telugu

Punjab: మొహాలీలో దారుణం.. సిద్ధూ మూస్ వాలా మృతికి ప్రతీకారంగా కబడ్డీ ప్లేయర్ హత్య

Sidhu Moose Wala Revenge

Sidhu Moose Wala Revenge

పంజాబ్‌లోని మొహాలీలో దారుణం జరిగింది. ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాణా బాలచౌరియా హత్యకు గురయ్యాడు. టోర్నమెంట్‌లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపి హతమార్చారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రతీకారంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Sydney Attack: ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’.. ఆస్పత్రిలో పరామర్శించిన ప్రధాని ఆంథోనీ

సోమవారం సాయంత్రం మొహాలీలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. వందలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కాల్పుల మోతతో భయకంపితులై చెల్లాచెదురయ్యారు. ఇంతలోనే ప్రముఖ కబడ్డీ ఆటగాడు, ప్రమోటర్‌ రాణా బాలచౌరియా‌ను కాల్చి చంపారు. ముందుగా తల, ముఖ్యంపై అనేకసార్లు కొట్టారు. దీంతో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. అనంతరం కాల్పులకు పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Nitish Kumar Video: వైద్యురాలి హిజాబ్‌ను తొలగించిన నితీష్‌కుమార్.. విపక్షాలు ఆగ్రహం

రాణా బాలచౌరియా సెక్టార్ 82లో జరిగిన సోహానా కబడ్డీ కప్ నిర్వాహకులలో ఒకరు. ఇక ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫీ పేరుతో బాలచౌరియా దగ్గరకు వచ్చి కాల్పులకు పాల్పడ్డారని మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్మన్‌దీప్ సింగ్ హన్స్ తెలిపారు. పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అనంతరం పారిపోయేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. బాలచౌరియాను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

సంఘటనాస్థలి నుంచి 32 క్యాలిబర్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు నుంచి ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులు లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. బాలచౌరియా.. సిద్ధూ మూస్ వాలా హంతకుడికి ఆశ్రయం కల్పించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాలచౌరియా హత్యకు గురైనట్లుగా అనుమానిస్తున్నారు.

ఈ బహిరంగ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. శాంతి భద్రతలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేంగింది. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రజా భద్రతను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాంధావా మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.

సిద్ధూ మూస్ వాలా (28) ప్రముఖ పంజాబ్ గాయకుడు. 2022, మే 29న హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే కబడ్డీ ప్లేయర్ హత్యకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

Exit mobile version