Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..

  • 2013 జీరాం ఘాటి మావోయిస్టు దాడి కేసులో కీలక తీర్పు.
  • 10 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.
  • దోషుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
  • 2013 మే 25న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి.
  • నంద్ కుమార్ పటేల్, మహేంద్ర కర్మ, విద్యాచరణ్ శుక్లా తదితర నేతలు హతం.
Jhiram Ghati Maoist Attack

Jhiram Ghati Maoist Attack

Jhiram Valley Maoist Attack: దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన మావోయిస్టు దాడుల్లో 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘‘జీరాం ఘాటీ దాడి’’ నిలుస్తుంది. ఈ కేసులో 10 మందిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. జగ్దల్‌పూర్ ప్రత్యేక కోర్టు అభయ్ సింగ్ రాజ్‌పుత్ తీర్పును వెలువరించారు. దోషుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 16న కోర్టు దోషులకు శిక్షల్ని ఖరారు చేయనుంది. 2013 మే 25న బస్తర్ జిల్లాలోని దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జీరాం లోయలో ఈ దాడి జరిగింది. కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసుకుని మావోయిస్టులు విరుచుకుపడ్డారు.

పరివర్తన్ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోలు దాడి చేశారు. ఈ దాడిలో అప్పటి ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్, అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హతమయ్యారు. మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు ‘సల్వాజుడుం’ అనే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసిన మహేంద్ర కర్మ కూడా ఇందులో మరణించడం మావోలు విజయంగా భావించారు. మొత్తం 29 మంది ఈ దాడిలో మరణించారు. ఈ దాడితో ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్రంగా దెబ్బతింది.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఎన్‌ఐఏ 2014 సెప్టెంబర్‌లో జగ్దల్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 101 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఈ దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తుతో పాటు రెండు న్యాయ కమిషన్లు కూడా విచారణ జరిపాయి. అయితే, ఈ తీర్పుపై రాజకీయ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఎన్ఐఏ వాస్తవాలను అణచివేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వలేదని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ సరైన భద్రత కల్పించడంలో విఫలమైందని అన్నారు. ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి, మాజీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ ఖండించారు. బఘేల్‌కు ఈ కేసుపై నిజమైన ఆసక్తి లేదని, రాజకీయాలు చేయడానికే ఈ అంశాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.