JEE Advanced 2022 Exam: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్సుడ్ పరీక్ష జరగనుంది. దీంతో అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అయ్యారు. ఆరు గంటల నిడివి కలిగిన ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్టు ఆగస్టు 28 ఉదయం 9 నుంచి ప్రారంభం అయి 12.00 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై 5.30 వరకు జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎగ్జామ్ రాసేందుకు అధికారులు అనుమతించరు.
పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేవారు జేఈఈ అడ్వాన్సుడ్ 2022 అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఇవి లేకుంటే పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. అభ్యర్థులు పెన్ను, పెన్సిల్ తో పాటు పారదర్శకంగా ఉండే వాటర్ బాటిళ్లను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. జేఈఈ పరీక్షల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించనున్నారు. శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే అధికారులు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. జేఈఈ అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ ను పరీక్ష ఇన్విజిలేటర్ కు అందచేయాలి.
Read Also: Bank Holidays: ఏకంగా 13 రోజులు బ్యాంకుల మూత..!
చివరి నిమిషంలో హైరానా పడేకంటే ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేసుకుంటే మంచిది. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షహాల్ లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.. హాల్ లో అభ్యర్థులు అనవసర కదలికను ఎప్పటికప్పుడు అధికారులు, ఇన్విజిలేటర్లు పర్యవేక్షిస్తుంటారు. పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో ఎగ్జామ్ జరుగుతుంది. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్ కేటాయిస్తారు. ఒక వేళ కీబోర్డు, మౌస్ పనిచేయకపోతే మరో సిస్టమ్ కేటాయిస్తారు. ప్రతీ సెంటర్ వద్ద పరీక్ష నిర్వహించే వారితో పాటు ఒకరు లేదా అంతకంటే ఎక్కువగా ఐఐటీ ప్రతినిధులు ఉంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్ లో 28 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 11న వెలువడనున్నాయి. అదే నెల 12 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది అడ్వాన్సుడ్ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి దేశంలోని 23 ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు.
