జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. తాజాగా గత రాత్రి మరో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అవంతి పొరా, శ్రీనగర్ ఎన్ కౌంటర్లలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ అమ్మీన్ భట్ ను ఒక రోజు ముందు ఉగ్రవాదులు హతమర్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను 24 గంటలు తిరగకముందే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
శ్రీనగర్ లోని సౌర ప్రాంతంలో గత రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఇద్దరూ నిషేధిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు సామాగ్రిని రికవరీ చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. చనిపోయిన ఇద్దరిని షెకీర్ అహ్మద్ వాజా, అఫ్రిన్ ఆప్తాబ్ మాలికగ్ గా గుర్తించారు. వీరిద్దరు కాశ్మీర్ షోఫియాన్ కు చెందినవారిగా, సీ కేటగిరి ఉగ్రవాదులుగా అధికారులు గుర్తించారు.
మరోవైపు కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులపై పగతీర్చుకున్నాయి భద్రతా బలగాలు. 24 గంటలు తిరగకముందే అవంతిపోరాలో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను కాల్చి చంపాయి. చనిపోయిన ఉగ్రవాదులను షాహిద్ ముష్తాక్ భట్ గా గుర్తించారు. లష్కర్ కమాండర్ లతీఫ్ సూచనల మేరకే అమ్రీన్ భట్ ను కాల్చి చంపారని ఐజిపి విజయ్ కుమార్ వెల్లడించారు.
కాశ్మీర్ లోయలో వరసగా మూడు రోజుల నుంచి ఎన్ కౌంటర్లు సాగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్లలో లష్కర్ ఏ తోయిబా, జైష్ ఇ మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. మూడు రోజుల్లో మొత్తం 10 మంది ఉగ్రవాదులను ఏరిపారేవారు. ఇందులో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు కాగా… ఏడుగురు లష్కర్ ఉగ్రవాదులు ఉన్నారు.
