NTV Telugu Site icon

Delhi: ప్రధాని మోడీతో ఒమర్ అబ్దుల్లా భేటీ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాపై చర్చ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు.

ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ తీర్మానించిన తీర్మాన పత్రాన్ని అమిత్ షాకు అందించారు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఒమర్ అబ్దుల్లా అందించిన తీర్మాన పత్రంపై అమిత్ షా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తామని.. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు అక్కర్లేదని, సుపరిపాలన, జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాల కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బుధవారం సాయంత్రం అమిత్ షాతో అరగంటపాటు జరిగిన సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా వర్గాలు తెలిపాయి.

జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించగా.. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం ఆమోదించారు. తాజాగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.