Site icon NTV Telugu

Coimbatore Blast: కేసులో కొత్త కోణం.. శ్రీలంక తరహాలో పేలుళ్లకు కుట్ర?

Jamisha Mubin Big Attack

Jamisha Mubin Big Attack

Jamisha Mubin Planned Srilanka Easter Attack In Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించగా.. ఈ ఘటనలో 25 ఏళ్ల జమేషా ముబీన్‌ మృతి చెందాడు. అతనికి.. శ్రీలంకలో ఈస్టర్ రోజున పేలుడు జరిపిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే.. ఈస్టర్ పేలుళ్ల నిందితుల్ని ముబీన్ కలిశాడని, ఆ పేలుళ్ల తరహాలోనే అతడు కోయంబత్తూరులో ప్లాన్ చేశాడని విచారణలో తేలింది. దీపావళి పండుగ సమయంలో.. కోయంబత్తూరు దేవాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించిన నేపథ్యంలో తమిళనాడు పోలీసులతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ముబీన్ ఇంటి నుంచి పేలుడు పదార్థాల తయారీలో వినియోగించే 75 కేజీల వస్తువులు, కెమికల్స్‌ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. అతనితో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లు ముబీన్ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను తీసుకొని పరారవ్వగా.. అధికారులు గాలింపు చర్యలు చేపట్టి, అదుపులోకి తీసుకున్నారు. 2019లో ఈ ముబిన్‌ను ఎన్‌ఐఏ విచారించినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనలో పేలిన కారు.. ఇప్పటివరకూ 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి.. భవిష్యత్తులో ఏదో ప్లాన్ చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఇదివరకే వెల్లడించారు.

మరోవైపు.. అధికారులు అరెస్ట్ చేసిన ఐదుగురు అనుమానితుల్లో కొందరు కేరళ కూడా వెళ్లి వచ్చినట్టు తాము భావిస్తున్నామని, ఇంకా దర్యాప్తు సాగుతోందని పోలీసు కమిషనర్ వి. బాలకృష్ణన్ చెప్పారు. ఈ కేసులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని తాము అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అల్-ఉమా వ్యవస్థాపకుడైన ఎస్ఏ బాషా సోదరుడు నవాజ్ ఖాన్, కొడుకు మహమ్మద్ తాలిఖ్ కోయంబత్తూరులోనే ఉన్నారన్నారు. 1996లో ఇదే నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో బాషా ప్రధాన నిందితుడని.. ఆ పేలుళ్లలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారన్నారు.

Exit mobile version