Jamili Elections: జమిలి ఎన్నికలు సాధ్యంకాదని కేంద్రం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమైన జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదని పేర్కొంది. జమిలి ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి ఐదు అవరోధాలున్నట్టు కేంద్రం పేర్కొంది. గురువారం రాజ్యసభలో సభ్యులు కిరోడిలాల్ మీనా(రాజస్థాన్), తంబిదురై(తమిళనాడు) అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బదులిస్తూ ఈ విషయం చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో అయిదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదాతో పాటు పలు ప్రయోజనాలున్నాయని తెలిపారు. ‘పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ యంత్రాంగం ఒకే పనిని వెంట వెంటనే చేయాల్సిరావడం తప్పుతుంది. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు పెద్ద మొత్తం ఆదా అవుతుంది. రెండు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంవల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి దీర్ఘ కాలం అమలుచేసే పరిస్థితి ఉండదు కనుక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంద’ని మంత్రి పార్లమెంటుకు తెలిపారు.
Read also: Digital Payments: దేశంలో భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. 13.24శాతం మేర వృద్ధి
ఇవి ప్రధానమైన ఐదు అవరోధాలు… రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలకు సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు కాలపరిమితికి సంబంధించిన అధికరణం 83, లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారాలు కల్పించే అధికరణం 85, రాష్ట్ర శాసనసభల కాలపరిమితిని నిర్దారించే అధికరణం 172, రాష్ట్ర అసెంబ్లీల రద్దు కోసం అధికరణం 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన అధికరణం 356ను సవరించాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి వస్తుంది. వాటితోపాటు మనది సమాఖ్య పరిపాలనా వ్యవస్థ కాబట్టి.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు జమిలి ఎన్నికలకు అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాల్సి వస్తుంది. ఇందుకోసం రూ.వేల కోట్లు అవసరం అవుతాయి. అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమర్పించిన నివేదిక, అందులోని వివిధ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లా కమిషన్ ముందుంచింది. లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అనువైన మార్గదర్శకాలను తయారుచేసే బాధ్యతను లా కమిషన్‌కు అప్పగించిందని మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు.
