NTV Telugu Site icon

Israel: అల్ జజీరా జర్నలిస్టుని చంపిన ఇజ్రాయిల్.. హమాస్‌కి సాయం చేస్తున్నాడని ఆరోపణ..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్ వరసగా తన శత్రువల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రతలో ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. తామే చేశామని చెప్పుకోకున్నా, ఇరాన్‌తో పాటు హమాస్ ఇది ఇజ్రాయిల్ పనే అని ఆరోపిస్తున్నాయి. మరోవైపు లెబనాన్ బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఎయిర్ స్ట్రైక్స్‌లో హతం చేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. అక్టోబర్ 07 నాటి దాడికి ప్రధాన సూత్రధారి అయిన మహ్మద్ డెయిఫ్‌ని కూడా చంపేసినట్లు పేర్కొంది.

Read Also: BSF: పారామిలటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ల తొలగింపు..

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రముఖ వార్త సంస్థ అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్ ఘౌల్‌ని వైమానికి దాడిలో చంపినట్లు ఇజ్రాయిల్ గురువారం ధ్రువీకరించింది. తమ పాత్రికేయుడిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందని అల్ జజీరా ఆరోపించినప్పటికీ, ఇవి నిరాధార ఆరోపణలని ఇజ్రాయిల్ కొట్టిపారేసింది. ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07న జరిగిన దాడిలో జర్నలిస్ట్ ఇస్మాయిల్ సహకరించినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ఎలైట్ నుఖ్బా యూనిట్‌లో అల్-ఘౌల్ సభ్యుడు అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ కార్యకలాపాలను ఎలా రికార్డ్ చేయాలో మిలిటెంట్లకు సూచించాడని చెప్పింది. ఇజ్రాయిల్ దళాలపై దాడులు రికార్డ్ చేయడం, ప్రచారం చేయడంలో అతను పాల్గొన్నట్లు పేర్కొంది. ఇతడి చర్యలు హమాస్ కార్యకలాపాల్లో ముఖ్యభాగం అని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది.

అల్-ఘౌల్ నవంబర్ 2023 నుండి నెట్‌వర్క్ కోసం పనిచేశాడని, అతడి వృత్తి జర్నలిజం మాత్రమే అని అల్ జజీరా తెలిపింది. మార్చి నెలలో ఇజ్రాయిల్ దళాలు గాజా స్ట్రిప్‌లోని అల్ షిఫా ఆస్పత్రి వద్ద అతడిని నిర్భందించి, ఆ తర్వాత విడుదల చేయబడ్డాడని, ఇతనికి ఏ సంస్థతో ప్రమేయం లేదని చెప్పింది. ఇజ్రాయిల్ ఆరోపణల్ని తిరస్కరించింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం అల్-జజీరాను ఇజ్రాయెల్‌లో నిర్వహించకుండా నిషేధించింది.