India-UAE-Israel axis: టారిఫ్‌ల పేరుతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. నాటోలో పెద్దన్నగా ఉన్న అమెరికా, ఇప్పుడు ఆ కూటమినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గ్రీన్‌ల్యాండ్ వ్యవహారం కారణంగా యూరప్ దేశాలతో కయ్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికా రక్షణ ఉంటుందా అనే అనుమానాలు పశ్చిమాసియా దేశాలను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త సైనిక కూటమిలు పుట్టుకొస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో తమ రక్షణ కోసం మిడిల్ ఈస్ట్ దేశాలు, ఇతర దేశాలు కూటములు కడుతున్నాయి.
ఇప్పటికే ‘‘సౌదీ అరేబియా- పాకిస్తాన్- టర్కీ’’లు కలిసి ‘‘ఇస్లామిక్ నాటో’’ కూటమికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ కూటమి టార్గెట్‌గా ‘‘భారత్-యూఏఈ-ఇజ్రాయిల్’’ మరో కూటమికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రీస్, సైప్రస్ వంటివి కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల, యూఏఈ అధ్యక్షుడుషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారత పర్యటనకు వచ్చారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందం దిశగా కీలక చర్చలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యెమెన్ అధికారం విషయంలో సౌదీ, యూఏఈ మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. సౌదీ వైపు పాకిస్తాన్ ఉండగా, యూఏఈ ఇండియా వైపు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఇస్లామిక్ నాటో దిశగా సౌదీ-పాక్-టర్కీ..
గతేడాది సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో, ఏదైనా దేశంపై శత్రు దేశం దాడి చేస్తే, అది తమ దేశంపై దాడిగా చూస్తామనే ఒక నిబంధన ఉన్నట్లు పాక్, సౌదీలు ప్రకటించాయి. మరోవైపు, ఇస్లామిక్ దేశాలకు రక్షణ విషయంలో పెద్దన్నగా వ్యవహరించాలని పాక్ భావిస్తోంది. టర్కీ ఈ రెండు దేశాలతో కలిసి ఇస్లామిక్ నాటో అనే కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సౌదీ ఆర్థిక శక్తి, పాక్ అణు, క్షిపణి సామర్థ్యాలు, టర్కీ సాంకేతికత ఒకే గొడుగు కిందకు వస్తే యూఏఈ వంటి దేశాలకు ప్రమాదం ఉంది.
పాక్ కూటమికి ధీటుగా భారత కూటమి..?
సౌదీ-పాక్-టర్కీ కూటమికి ప్రత్యామ్నాయంగా భారత్-ఇజ్రాయిల్-యూఏఈ-గ్రీస్ దేశాలు కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త మాక్స్ అబ్రహంస్ అన్నారు. టర్కీ-పాకిస్తాన్-సౌదీ పొత్తు భారతదేశానికి మాత్రమే కాకుండా ఇజ్రాయెల్, అర్మేనియా , సైప్రస్‌లకు కూడా ముప్పును కలిగిస్తుందని పలువురు మాజీ సైనికాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే, యూఏఈ-ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య అబ్రహం ఒప్పందం ఉంది. భారత్, ఇజ్రాయిల్, అమెరికా, యూఏఈలు కలిసి I2U2 కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ఇజ్రాయిల్ అన్ని వేళల్లో భారత్‌కు మద్దతు ఇస్తూనే ఉంది. యూఏఈతో భారత్‌కు విస్తృత వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఇటీవల గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలపడ్డాయి. ఇక ఆర్మేనియాకు భారత్ ఆయుధాలను అమ్ముతోంది. ఆర్మేనియాకు వ్యతిరేకంగా అజర్ బైజాన్‌కు మద్దతుగా పాక్, టర్కీలు నిలుస్తున్న నేపథ్యంలో ఆర్మేనియాకు భారత్ ఆకాష్ వంటి క్షిపణుల్ని అమ్ముతోంది. ఇటీవల పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే భారత్ కేంద్రంగా కొత్త కూటమి పుట్టుకొస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
