May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు

  • అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
  • ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి
  • ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది
May 1st Labor Day

May 1st Labor Day

కార్మికులు, కర్షకులు లేని ప్రపంచాన్ని ఊహించలేము. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి. కార్మికుల పోరాటం, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు కార్మికుల హక్కులను కాపాడటానికి, వారి సహకారాన్ని గౌరవించడానికి, శ్రామిక వర్గం పోరాటాలను స్మరించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జీవితాలను మార్చివేసింది. కానీ ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దానికి మే 1వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు. భారత్ లో కార్మిక దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈరోజే ఎందుకు జరుపుకుంటారు?

మే 1న కార్మిక దినోత్సవ వేడుకలు 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. దీనికి ముందు, అమెరికా, యూరప్‌లోని కర్మాగారాల్లోని కార్మికులను 15-16 గంటలు పని చేయించేవారు. కానీ ఆ పనికి ప్రతిఫలంగా వారికి చాలా తక్కువ వేతనాలు చెల్లించేవారు. కార్మికులకు ఎటువంటి హక్కులు లేవు. వారికి ఎటువంటి సెలవులు ఉండేవి కావు. కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. దీనితో ఇబ్బంది పడిన వేలాది మంది కార్మికులు 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని గంటలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది. కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయడానికి, పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చాలా మంది కార్మికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని తరువాత, 1889లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో, కార్మికుల పోరాటం, త్యాగాలను గుర్తుచేసుకోవడానికి మే 1ని “అంతర్జాతీయ కార్మిక దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించారు.

భారత్ లో కార్మిక దినోత్సవం

భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు 1923 మే 1న చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ రోజున, మద్రాస్ హైకోర్టు ముందు కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కుల గురించి గళాన్ని వినిపించింది. కార్మిక దినోత్సవం కేవలం సెలవుదినం కాదు. కార్మికుల సహకారాన్ని గౌరవించే రోజు. నేటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం, సామాజిక న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది.

తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు మంత్రి పొన్నం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయ పూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్ లో మీ హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.