నీట్ రద్దు విద్యార్థులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. త్వరలో రీ-ఎగ్జామ్ కూడా జరగబోతుంది. ఇంతలోనే అనేక మంది మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇండోర్‌లో మరో విద్యాకుసుమం రాలిపోయింది.
ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల అవంతిక.. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతోంది. అయితే గురువారం రాత్రి భవనం పైనుంచి దూకేసింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించకపోవడంతో సీసీటీవీ, ఫోన్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… గురువారం రాత్రి సుమారు 11:30 గంటలకు జరిగింది. అవంతిక నాలుగు అంతస్తుల ఇంటి బాల్కనీలో నిలబడి తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆ తర్వాత భవనం పై అంతస్తుకు వెళ్లినట్లు సమాచారం. కొద్దిసేపటికే కుటుంబ సభ్యులు పెద్ద శబ్దం విని కిందపడి తీవ్రంగా గాయపడిన ఆమెను గుర్తించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మహారాజా యశ్వంతరావు (MY) ఆసుపత్రికి రిఫర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అవంతిక స్వస్థలం ధార్ జిల్లా. ఆమె నీట్ పరీక్షకు సిద్ధం కావడానికి డాక్టరైన తన అక్కతో కలిసి ఇండోర్‌లో ఉంటోంది. వైద్య రంగానికి చెందిన ఆమె తండ్రి కూడా ఇండోర్‌లో శిక్షణ పొందుతుండగా.. ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన ఫ్లాట్‌లోనే ఉన్నారు. ఇక అవంతిక సోదరుడు దర్యాప్తు అధికారులకు కీలక విషయాలు వెల్లడించారు. గతంలో విషపదార్థం సేవించి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పాడు. ఇండోర్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన టించా జలపాతాన్ని సందర్శించాలని ఆమె ఇటీవల కోరినప్పటికీ.. ఆమెకు అనుమతి లభించలేదని చెప్పాడు. అయితే అవంతిక మరణానికి ముందు తన అక్కతో వీడియో కాల్‌లో మాట్లాడింది. అనంతరం విద్యార్థిని భవనం నుంచి దూకిందని సోదరుడు, బంధువు, తండ్రి పోలీసులకు తెలిపారు. అయితే తాము ఈ కేసులోని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు్న్నారు.

