IndiGo Refund Rs 610 Crore: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించింది. టికెట్ల సొమ్ము రూ.610 కోట్లను ఇండిగో రీఫండ్ చేసింది. అలాగే, 3000 లగేజీ బ్యాగులను ఇప్పటి వరకు ప్యాసింజర్లకు అందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే, సాధారణంగా రోజుకు 2,300కి పైగా విమానాలు నడిపే ఇండిగో, శనివారం నాడు 1,500కి పైగా ఫ్లైట్లు నడిపినట్లు పేర్కొనింది. ఇక, ఈ సంఖ్యను ఈరోజు సుమారు 1,650కు పెంచుతూ, తమ 138 గమ్యస్థానాల్లో 135 ట్రిపులను పునరుద్ధరించినట్లు తెలిపింది.
Read Also: December Deadlines: బిగ్ అలర్ట్.. ఐటీఆర్ నుంచి ఆధార్-పాన్ లింక్ సహా ఈ పనులకు 31 వరకే గడువు..
ఇక, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ.. ఇండిగో సంస్థ యొక్క ఆన్–టైం పని తీరు మెరుగు పడిందన్నారు. గత వారం రోజుల్లో జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నాను అన్నారు. అలాగే, ఎయిర్‌పోర్టులకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండటానికే చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని వివరణ ఇచ్చారు. విమాన రద్దుల వల్ల ప్రయాణికులపై భారం పడినా, నెట్‌వర్క్‌ను రీబుట్ చేసి మరింత ప్రణాళికాబద్ధంగా నడపడానికి ఇది సహాయపడిందని చెప్పారు. అయితే, డిసెంబర్ 10వ తేదీ నాటికి తమ మొత్తం నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో స్థిరపడుతుందని అంచనా వేస్తోంది. విమాన రద్దులు, ఆలస్యాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు సేవలను వేగంగా పునరుద్ధరించేందుకు ఇండిగో ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.
