Flight Charges Hike: దేశీయ విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్ అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ స్పైస్‌జెట్, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్ తమ టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచేశాయి. ఢిల్లీ- ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ సాధారణంగా రూ. 20 వేలు ఉండేది.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ. 60 వేలు దాటింది. అలాగే, ముంబై- శ్రీనగర్ మార్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో: రూ. 10 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. 62 వేలకు టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఇక, అదే రూట్‌లో ముంబై- శ్రీనగర్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ. 92 వేలకు చేరింది.
Read Also: CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అయితే, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ తమ టికెట్ రేట్ల పెంపకంతో ప్రయాణికులను షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ ధరలతో పోలిస్తే ఢిల్లీ- న్యూయార్క్ కనిష్ట టికెట్ ధర కేవలం రూ. 36,600 మాత్రమే ఉంది. ఇక, ఢిల్లీ- ముంబై టికెట్ ధర రూ. 40,450గా ఉంది. అంటే అంతర్జాతీయ ప్రయాణం కంటే దేశీయ ప్రయాణమే ఇప్పుడు మరింత ఖరీదు అవుతోంది.
Read Also: iBomma Ravi: మూడు కేసుల్లో ఐబొమ్మ రవి కస్టడీకి అనుమతి
అలాగే, ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే టికెట్ ధర రూ. 40 వేల పైగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణంగా డొమెస్టిక్ టికెట్లు రూ. 6 వేల నుంచి 10 వేల మధ్య టికెట్ లభించే పరిస్థితి ఉండేది కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండిగో నిర్వహణ లోపాలతో వందలాది విమానాలు రద్దు కావడంతో, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వేలాది మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హఠాత్తుగా పెరిగిన ధరల వల్ల ప్యాసింజర్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. అత్యవసర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారు అధిక ధరలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
