కేంద్ర ప్రభుత్వం లోన్ యాప్‌లపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న అనేక లోన్ యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసిందని పార్లమెంట్‌లో ప్రకటించింది. దాదాపు 87 లోన్ యాప్‌లు బలవంతపు వసూళ్లు, వేధింపులు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వాటిపై నిషేధం విధించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత చాలామంది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బయట నుంచి అప్పు దొరకకపోవడంతో చాలామంది ఆన్‌లైన్ లో లోన్ యాప్‌లను ఆశ్రయించారు. దీనిని అవకాశంగా మార్చుకున్న కొన్ని యాప్‌లు అధిక వడ్డీ, సర్వీస్ ఛార్జీల పేరుతో వేల రూపాయలు వసూలు చేశాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల నడుమ చాలా మంది ఆన్‌లైన్ లోన్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
లోన్ యాప్‌లు పెద్దగా డాక్యుమెంట్లు అడగకుండానే కొద్ది నిమిషాల్లోనే డబ్బులు అకౌంట్‌లో జమ చేస్తుండడంతో ప్రజలు వాటిపై ఆధారపడడం మరింత పెరిగింది. అయితే రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వారిపై యాప్ నిర్వాహకులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులను భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా నమోదయ్యాయి.
ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజలను దోపిడీ, వేధింపుల నుంచి రక్షించడానికి ప్రభుత్వంఇ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో వెల్లడించారు. లోన్ యాప్‌లపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని కూడా ఆయన తెలిపారు.
