NTV Telugu Site icon

Indian education before and after 1947: అక్షరం.. ‘అమృతం’.. అజేయం. 1947కి ముందు, తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ.

Indian Education Before And After 1947

Indian Education Before And After 1947

Indian education before and after 1947: బడిని గుడిలా భావించిన భారతదేశం.. చదువుల విషయంలో మొదటి నుంచీ మంచి పేరే సంపాదించుకుంది. నేనంటే ఇదీ అని నిరూపించుకుంది. కానీ.. మధ్యలో ఇంగ్లిష్‌వాళ్ల ఇష్టాయిష్టాలకు తగ్గట్లు మార్పులూ చేర్పులకు లోనై ఇబ్బందులు పడింది. 1947లో మన దేశం మన చేతుల్లోకి వచ్చాక మునుపటి మాదిరిగా ముందడుగు వేసేందుకు ‘ప్రణాళిక’ ప్రకారం ప్రయత్నాలు చేస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.. ఇంటింటా చదువు దేశానికి వెలుగు అని గుర్తించి వందో ఇండిపెండెన్స్‌ డే నాటికి వంద శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తోంది.

నాడు.. నేడు..

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్య భారతదేశం ఈ అరుదైన సందర్భాన్ని అందమైన ఉత్సవంగా జరుపుకుంటోంది. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను సగర్వంగా గుర్తుచేసుకుంటోంది. వర్తమానాన్ని ఒకసారి విశ్లేషించుకుంటోంది. బంగారు భవిష్యత్తును ఊహించుకుంటోంది. ఆ దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. ముఖ్యంగా సమాజాన్ని తీర్చిదిద్దే విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. నవతరం కోసం నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. మరో ఎనిమిదేళ్లలో బడిఈడు పిల్లలందర్నీ సరస్వతి ఒడిలో చేర్పించాలని సంకల్పించింది.

గోల్డెన్‌ ఫ్యూచర్‌ ప్లాన్‌

యూనివర్సిటీలను, కాలేజీలను యునైట్‌ చేసి అద్భుతమైన అధ్యయన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రగతి(శీల) ప్రణాళికలను రచించింది. పరిశోధనలకు వెన్నుదన్నుగా నిలిచే ఫౌండేషన్లను నెలకొల్పాలని నిర్ణయించింది. చదువుల్లో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకునేలా ప్రోత్సాహం అందించనుంది. ఈ మేరకు టెక్నాలజీ ఫోరమ్‌లను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే స్టార్టప్‌లకు క్యాపిటల్‌గా నిలిచిన మన దేశం ఎడ్యుకేషన్‌లో పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి సమాయత్తమవుతోంది.

ఘనం.. గతం..

ఇండిపెండెన్స్‌ని కోల్పోకముందు ఇండియా ప్రపంచ దేశాలకు అక్షర కేంద్రమంటే అతిశయోక్తి కాదు. ఆయుర్వేదం, ఆస్ట్రానమీ, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్టులకు స్టడీ సెంటర్‌గా విలాసిల్లటం విశేషం. అయితే ఆ ఘనత అంతా ఆంగ్లేయుల పాలనలో క్రమంగా అంతమైంది. ‘గతం’లా మాసిపోయింది. ఆధునికత జాడల్లేని ఆ రోజుల్లోనే భారతదేశంలో విద్యా బోధన ఆదర్శంగా నిలిచింది. అందుకే ఇతర దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి విచ్చేసేవారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం మన చదువులను వాళ్లకు అవసరమైనవిధంగానే మార్చుకుంది. దీంతో తనదైన ముద్రను కోల్పోయింది.

ఇండియా ఈజ్‌ బ్యాక్‌..

ఏళ్లకొద్దీ సాగిన స్వాతంత్ర్య పోరాటం 75 వసంతాల కిందట ఫలించటంతో ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఇప్పటి రూపాన్ని సంతరించుకోవటంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ స్వీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ సాక్షిగా డిజిటల్‌ ఇండియాగా అవతరించేందుకు పురోగమిస్తోంది. 1947లో 12 శాతమే ఉన్న అక్షరాస్యత ప్రస్తుతం 77 శాతానికి పైగా పెరగటం చెప్పుకోదగ్గ విషయం. గొప్ప విజయం. సెంట్‌ పర్సెంట్‌ లిటరసీని చేరుకోవటానికి మన దేశం శరవేగంగా పరుగెత్తుతోంది.

సక్సెస్‌కి సాక్ష్యాలు

అప్పట్లో 2 లక్షలు మాత్రమే ఉన్న పాఠశాలల సంఖ్య ఇప్పుడు 15 లక్షలకు చేరటం గమనార్హం. విశ్వవిద్యాలయాలు 20 నుంచి 1000కి చేరాయి. 33 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏకంగా 3000 దాటడం మామూలు డెవలప్మెంట్‌ కాదు. ప్రస్తుతం మన దేశ జనాభాలో మూడో వంతుకు పైగా స్టూడెంట్సే ఉన్నారు. దేశవ్యాప్తంగా విద్య కోసం కోటి రూపాయలే ఖర్చు చేసే స్థితి నుంచి ఇప్పుడు లక్ష కోట్లు కేటాయించే స్థాయికి చేరుకున్నాం. అందరికీ అక్షరజ్ఞానాన్ని అందించే దిశలో అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా ఇండియా ముందుకే పయనిస్తోంది.

భారతీయ బాస్‌లు

ప్రపంచంలోని పలు పెద్ద సంస్థలకు అధిపతులుగా ఇప్పుడు భారతీయులే ఉండటం మనకు గర్వకారణం. వాళ్లందరూ తమ ఉన్నత చదువులను ఇండియాలోనే పూర్తిచేశారంటే మన విద్యా వ్యవస్థ మూలాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల కన్నా అక్షరాలు మిన్న అని నమ్మిన, ఆచరించిన భారతదేశం ఒకప్పుడు అత్యుత్తమ చదువులకు కేంద్ర బిందువు. ఇప్పుడు అమృత వేడుకల నేపథ్యంలో మహోన్నత శిఖరాలను అధిరోహించే పథంలో సాగుతోంది. ఈ క్రమంలో చేరుకోవాల్సిన గమ్యాలు, దాటి వెళ్లాల్సిన మైలురాళ్లు చాలా ఉన్నాయి.

నిత్యం.. నేర్చుకుంటూ..

సాధించింది ఒక సగం.. సాధించాల్సింది మరో సగం అన్నట్లుగా మన విద్యా రంగం ప్రస్తుతం పయనిస్తోంది. నిరంతర పర్యవేక్షణలు, సమగ్ర పరిశీలనలు, అధ్యయనాలు, సమీక్షలు జరుపుకుంటూ సరికొత్త పథకాలు, చట్టాలతో ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోంది. 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కోసం 2009లోనే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చాం. అయినా ఇంకా దాదాపు మూడున్నర కోట్ల మంది పిల్లలు బడులకు దూరంగానే ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మనం 0.69 శాతం మాత్రమే రీసెర్చ్‌ కోసం ఖర్చు చేస్తున్నాం. విద్యకు 3 శాతమే కేటాయిస్తున్నాం.

మరింత ‘ప్రొఫెషనల్‌’గా..

పరిశోధనల కోసం చేసే వ్యయాన్ని జీడీపీలో కనీసం 6 శాతానికి పెంచాల్సి ఉంది. 19-24 ఏళ్ల మధ్య వయసు భారతీయుల్లో 5 శాతం మందే వృత్తి విద్య అభ్యసిస్తున్నారు. దక్షిణ కొరియాలో అయితే 96 శాతం మంది వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఇండియాలో ఇంటర్‌ పూర్తయినవాళ్లలో సగం మందే పైచదువులకు వెళుతున్నారు. దీన్ని 50 శాతానికైనా పెంచాలి. డేటా సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తదితర అధునాతన రంగాల్లోకి, కోర్సుల్లోకి ప్రవేశించి అద్భుతాలను సృష్టించాలి.

వెల్‌కం టు ఆల్‌

విజన్‌-2047ను రూపొందించుకొని వందేళ్ల స్వతంత్ర భారతాన్ని వండర్‌ఫుల్‌ కంట్రీగా క్రియేట్‌ చేయాలి. నిరుద్యోగం నిల్‌ అనే రేంజ్‌కి ఇండియాలో గ్రోత్‌ రేట్‌ దూసుకుపోవాలి. అన్ని రంగాల్లోనూ ఎంపవర్‌మెంట్‌ను సొంతం చేసుకోవాలి. ఈ బాటలో విద్యార్థులు చదవాల్సిన కోర్సులను, కెరీర్‌పరంగా పాటించాల్సిన సలహాలను, సూచనలను ‘ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్‌’లోని ‘స్టడీ N జాబ్స్‌’ పోర్టల్‌ ఒక ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌లా టీచ్‌ చేస్తుందని మాటిస్తున్నాం. ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి పేరెంట్‌కి ఇదే మా సుస్వాగతం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేళ అందరికీ శుభాకాంక్షలు.