Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!

  • 2070 నాటికి హిందూ మెజారిటీ దేశంగానే భారత్.. దేశ జనాభాలో హిందువుల వాటా 79 నుంచి 76 శాతానికి తగ్గుతుందని అంచనా. ముస్లింల జనాభా వాటా 15 శాతం నుంచి 20 పెరుగుతుందన్న స్టడీ..
Hindu Population

Hindu Population

Hindu Population: ప్రపంచవ్యాప్తంగా మతాల వారీగా జనాభా స్వరూపంపై ప్యూరీసెర్చ్ సెంటర్ అధ్యయనం విడుదలైంది. రాబోయే కొన్ని దశాబ్ధాల పాటు భారత్ హిందూ మెజారిటీ దేశంగానే కొనసాగుతుందని, అయితే 2070 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో నిలువనుందని  తెలిపింది. 2035 నాటికి క్రైస్తవుల్ని అధిగమించి, ప్రపంచంలోనే ముస్లింలు అతిపెద్ద మత సమూహంగా అవతరిస్తారని అధ్యయనం వెల్లడించింది.

హిందువుల జనాభాలో ఫస్ట్ ప్లేస్.. ముస్లిం జనాభాలో రెండో స్థానం..

2020 నాటికి భారత్‌లో 100 కోట్లకు పైగా హిందువులు ఉండగా, 6.5 కోట్ల మంది హిందువులు ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నేపాల్, బంగ్లాదేశ్‌లో ఉన్నారు. రాబోయే దశాబ్ధాల్లో భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య పెరుగనుంది. అయితే, ఇతర మతాల జనాభాతో పోలిస్తే హిందువుల వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రపంచ జనాభాలో హిందువుల శాతం స్వల్పంగా తగ్గనుంది.

భారత్‌లో హిందువుల సంఖ్య 2070 నాటికి  111 కోట్ల నుంచి 129 కోట్లకు పెరగనుంది. ముస్లింల జనాభా 21.3 కోట్ల నుంచి 33.4 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2020లో హిందువుల జనాభా శాతం 79గా ఉంటే, ఇది 2070 నాటికి 76 శాతానికి పడిపోతుందని, ఇదే సమయంలో ముస్లింల జనాభా వాటా 15 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

2020 నుంచి 2070 మధ్య ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య 19.9 కోట్లు పెరిగి దాదాపు 140 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, హిందువులతో పోలిస్తే ఇతర మతాల జనాభా దీని కన్నా వేగంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా 15 శాతంగా ఉండగా, 2070 నాటికి ఇది 14 శాతానికి తగ్గుతుంది.

అత్యధిక హిందువులు ఉన్న దేశాలు ఏవి..?

2020 నాటికి ప్రపంచ హిందువుల్లో 95 శాతం మంది ఉంటే, దాదాపు 110 కోట్ల మంది భారత్‌లోనే నివసిస్తున్నారు. భారత్ తర్వాత నేపాల్‌లో 2.4 కోట్ల మందితో రెండో స్థానంలో, బంగ్లాదేశ్ 1.3 కోట్ల మందితో మూడోస్థానంలో, పాకిస్తాన్ 50 లక్షల మందితో నాలుగో స్థానంలో, ఇండోనేషియా 40 లక్షల మందితో ఐదో స్థానంలో ఉంది.

2020 నుంచి 2070 మధ్య మార్పులు ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద హిందూ జనాభా కలిగిన దేశంగా అమెరికా నిలువనుంది. ఆస్ట్రేలియా టాప్-10 హిందూ జనాభా దేశాల్లో చేరనుంది. దాదాపు 30 లక్షల మంది ఆస్ట్రేలియాలో నివసించనున్నారు. ఇదే సమయంలో హిందూ జనాభా పాకిస్తాన్‌లో రెట్టింపై కోటి మందికి చేరుకోనుంది. ఇదే సమయంలో మారిషస్, ఫిజీ, సురినామ్ దేశాల్లో హిందువుల జనాభా తగ్గనుందని అంచనా వేశారు.

మతమార్పిడి, వలసల ప్రభావం..

ప్రపంచ హిందూ జనాభాపై మతమార్పిడుల ప్రభావం చాలా తక్కువగా ఉందని స్టడీ వెల్లడించింది. చిన్నతనంలో హిందువులుగా పెరిగిన వారిలో 99 శాతం మంది పెద్దయ్యాక ఇదే మతంలో ఉంటారు. ఇలాగే ముస్లింలలో 99 శాతం మంది ఉంటున్నారు. క్రైస్తవుల్లో ఈ శాతం 85గా, బౌద్ధుల్లో 83 శాతంగా ఉంది. 2020 నుంచి 2070 మధ్య మత మార్పిడుల కారణంగా ప్రపంచ హిందూ జనాభా మొత్తం మీద 10 లక్షల మంది తగ్గుతుందని అంచనా.

మరోవైపు, వలసల కారణంగా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతం, యూరప్‌లో హిందువుల జనాభాకు వలసలు కారణమవుతున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో 2070 నాటికి వలసల ద్వారా 80 లక్షలకు పైగా హిందువులు అదనంగా పెరుగుతారని అంచనా. ఇదే సమయంలో హిందువుల్లో 52 శాతం మంది 30 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం.

తగ్గుతున్న హిందూ సంతానోత్పత్తి రేటు..

ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2020-2025 మధ్య ప్రపంచ హిందువుల మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 1.9 మంది పిల్లలుగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచంలో ఇతర మతాల సంతానోత్పత్తి రేటు 2.3 గా ఉంది. అధిక హిందూ జనాభా కలిగిన ఆసియా దేశాల్లో నేపాల్‌లో 2.0, భారత్‌లో 1.9, బంగ్లాదేశ్‌లో 1.9గా సంతానోత్పత్తి రేటు ఉంది. భారత్‌లో గత కొన్ని దశాబ్దాలుగా సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గింది. హిందువుల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం హిందువుల సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 3.3 మంది పిల్లలుగా ఉండేది.